హైదరాబాద్, మహా
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక సరిగ్గా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు బర్త్ డే కు ఒక్కరోజు ముందుగా ఇవ్వడం, ఇందులో పాల్గొన్న అధికారుల పేర్లు.. నివేదిక పూర్తిగా బయటకు రావడం సంచలనంగా మారింది. ఇది వ్యూహాత్మకమా? కాకతాళీయమా? అన్నది చర్చగా మారింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావే తీవ్ర ఇబ్బంది పెట్టారని, ఇపుడు పార్టీ కీలకనేతలంతా డల్లాస్ లో సంబరాల్లో ఉన్న సమయంలో నివేదికను లీక్ చేయడం ద్వారా ఓ వైపు మాజీ సీఎం కేసీఆర్ ను, మాజీ మంత్రి హరీష్ రావును ఒత్తిడికి గురికావడం విధి లిఖితమంటూ కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. ఈనెల 6న కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణకు హాజరుకావాల్సి ఉండగా, హరీష్ రావు అరెస్ట్ కు రంగం సిద్దమైందా? లేక మైండ్ గేమా? అన్నది బిఆర్ఎస్ ముఖ్యుల్లో చర్చ జరుగుతున్నది. ఒత్తిళ్ళకు గురిచేసినా హరీష్ రావు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని, హరీష్ రావు అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని హరీష్ రావు అనుచరులు అంటున్నారు.







