Mahaa Daily Exclusive

  ఎవ‌రు గెలిచినా చ‌రిత్రే! నేడే ఐపీఎల్ ఫైనల్ సమరం ఉత్కంఠ రేపుతున్న చివరి మ్యాచ్..!

Share

మహా: ఐపీఎల్ ఫైన‌ల్‌లో రాయల్స్ బెంగళూర్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. నేడు జ‌రిగే తుది పోరులో రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అటు బెంగ‌ళూరు, ఇటు పంజాబ్ ఒక్క ఐపీఎల్ టోర్నీ కూడా గెల‌వ‌లేదు. దీంతో ఎవ‌రు విజేత‌గా నిలిచినా.. అది చ‌రిత్రే. 18 సీజ‌న్ల పాటు ఐపీఎల్ క‌ప్పు బెంగ‌ళూరుని ఊరిస్తూనే ఉంది. ‘ఈసారి క‌ప్ మ‌న‌దే’ అంటూ ప్ర‌తీసారీ అభిమానుల‌కు మాట ఇవ్వ‌డం, ఉత్తి చేతుల‌తో ఇంటికి వెళ్ల‌డం బెంగ‌ళూరుకు ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈసారి మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ క‌ప్పు చేజారిపోకూడ‌ద‌న్న క‌సి.. బెంగ‌ళూరు ఆట‌గాళ్ల‌లో క‌నిపిస్తోంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నెంబ‌ర్‌. ఇది 18వ ఐపీఎల్‌. సెంటిమెంట్ ప్ర‌కారం.. క‌ప్పు కొట్టే ఛాన్స్ బెంగ‌ళూరుదే అని అభిమానులు లెక్క‌లేస్తున్నారు. బెంగ‌ళూరు టాప్ ఆర్డ‌ర్ ఫామ్‌లో ఉండ‌డం, కోహ్లీ నిల‌క‌డ‌గా ఆడుతుండ‌డం, బౌల‌ర్లు స‌మష్టిగా రాణించ‌డం, అభిమానుల అండ, దండ ఇవ‌న్నీ బెంగ‌ళూరుకు ప్ల‌స్ పాయింట్స్‌. పంజాబ్ కింగ్స్‌పై ముందు నుంచీ ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. కానీ ఆ జ‌ట్టు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ అద్భుత‌మైన ఫ‌లితాల్ని అందుకొంది. ఓపెన‌ర్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. ఇంగ్లీస్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫ‌యింగ్ 2లో ముంబై చేతిలోంచి మ్యాచ్ లాగేసుకోవ‌డం వెనుక ఇంగ్లీస్ పాత్ర కీల‌కం. బుమ్రా ఓవ‌ర్లో 20 ర‌న్స్ కొట్టి, ముంబై ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ తీశాడు. బ్యాటింగ్ లైన‌ప్ కూడా చాలా బ‌లంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్య‌ర్ జ‌ట్టుని ముందుండి న‌డిపిస్తున్న విధానం అబ్బుర ప‌రుస్తోంది. క‌ప్పు కొట్టాకే పండ‌గ‌ అన్న‌ట్టు క‌నిపించాడు. మొత్తానికి ఏ జ‌ట్టు గెలిచినా అభిమానుల‌కు ఆ సంబ‌రం చూడ‌డం క‌నుల పండుగ‌గా ఉంటుంది.