సిద్దిపేట, మహా:కాంగ్రెస్ ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు పోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కేసులు ఎదుర్కొవాల్సిందే..శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీహెచ్ఆర్ నగర్‌లో హాస్టల్ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. విచారణ నిజాయితీగా జరగాలని కోరారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది అందరూ చెబుతున్న మాట అని చెప్పారు. కాళేశ్వరం అవినీతికి గత ముఖ్యమంత్రి కేసీఆర్, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని, విచారణ త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
బీజేపీని కనపడనీయకుండా చేసేందుకు..
18 నెలలుగా కాళేశ్వరం విచారణ కమిషన్ సమయాన్ని రేవంత్ ప్రభుత్వం రెండేసి నెలలుగా పెంచుకుంటూ పోవడంతో ప్రజల్లో కక్ష సాధింపు చర్యలనే అనుమానం కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కనపడనీయకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని.. పోటీ చేసే వారిని తప్పకుండా గెలిపించుకుంటామని ఉద్ఘాటించారు.








