Mahaa Daily Exclusive

  పార్టీ బతకాలంటే మార్పు కావాలె! బీఆర్ఎస్‌లో అంతర్గాత మార్పులు జరగాలి మా పార్టీలోని లోపాలను సవరించుకుంటాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!

Share

జగిత్యాల, మహా: గులాబీ పార్టీ అగ్ర నేతలపై ధిక్కార స్వరం వినిపిస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ అమ్మవారి ఆలయం వార్షికోత్సవంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీలో మార్పులు చేర్పులు జరగాలని కోరుకోవడం సహజమన్నారు. పార్టీలోని కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ బతకాలి అంటే మార్పులు కావాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కవిత.. ఇదే సమయంలో పార్టీ మీద ఎవరైనా దాడి చేస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‎కు నోటీసులు ఇచ్చారని.. ప్రజా సమస్యల నుండి దృష్టి మరల్చడం కోసమే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
వేధింపులకు భయపడే వాళ్ళం కాదు..
ప్రభుత్వం ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని.. అధికార పార్టీ దాడులను తిప్పికొడతామన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్‎కి తాళం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ‘పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు.