ఆదిలాబాద్, మహా
జీవితం ఎంతో విలువైందని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నారు. పొలిసు శాఖా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాంటి డ్రగ్ వీక్ లో భాగంగా రన్ ఫర్ హోప్ నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించగా… దాదాపు నాలుగు వేల మంది యువత, విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. ముందుగా నో డ్రగ్స్ నినాదంతో ఏర్పాటు చేసిన బోర్డుపై అతిథులు సంతకాలు చేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి 5K రన్ ను ప్రారంభించారు. అనంతరం స్వయంగా 5K రన్ ను పూర్తి చేసి విజేతలుగా నిలిచిన మొదటి 15 మంది విద్యార్థులకు సైకిల్ లను బహుమతులుగా అందజేశారు. కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వద్ద ప్రత్యేకంగా కేటాయించిన టోకెన్లు తీసుకుని తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రన్ లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన పదిమంది పురుషులకు, ఐదుగురు మహిళలకు అతిథులు బహుమతులు అందించారు. రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ లను సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, dfo ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బోజ్జు పటేల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు మంత్రి జూపల్లి కృష్ణ రావు మాట్లాడుతూ… జీవితం విలువైనదని, దానిని నలుగురికి ఉపయోగ పడేలా జీవించాలని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు గర్వపడేలా ఎదగ వచ్చని తెలియజేశారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు.








