Mahaa Daily Exclusive

  విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు –మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాలను మండల తహశిల్దార్ సంధ్యారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామిలతో కలిసి సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహశిల్దార్, మండల పరిషత్ అభిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను సందర్శించి వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. వివిధ సమస్యలపై
గ్రామీణ,పట్టణ వాసులు అందించే పిర్యాదులు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరంగా త్రాగునీటితో పాటు పారిశుద్ధ్య పనులు పకడ్బంధీగా చేపట్టాలని అధికారులను కోరారు.

66 లక్షల వ్యయంతో వసతి గృహం గదులకు భూమి పూజ

66 లక్షల వ్యయంతో నీల్వాయి గ్రామంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో
వసతి గృహం గదులకు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఈమధ్య పూర్తి చేసిన ఇంటర్మీడియట్ నూతన తరగతులను వారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువులకు వెళ్ళే విద్యార్థులకు 18 సంవత్సరాలు వయస్సు పూర్తవుతుందని పేర్కొన్నారు. వీరందరూ ఓటరు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలని వెల్లడించారు. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా మనకు మనకు వచ్చిందన్నారు.
యువతులు ఉన్నత చదువులు అభ్యసించి వ్యాపారం, ఉద్యోగ రంగాలలో రాణించడం వల్ల కుటుంబం, సమాజాభివృద్ధి చెందుతుందన్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం 40 శాతం డైట్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు. 1 సంవత్సరం నుండి దాదాపు 150 కోట్ల రూపాయల నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ క్రింద అభివృద్ధి చేపట్టడం జరిగిందని తెలిపారు.

33/11 విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

2 కోట్ల 48 లక్షల వ్యయంతో
రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి నిధులతో నిర్మించిన 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ లు ప్రారంభించారు. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్.ఈ., సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.