Mahaa Daily Exclusive

  నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం విత్తన దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు పీడీ యాక్ట్‌తో కఠిన చర్యలు తప్పవు : సీఐ నాగరాజు రెడ్డి..!

Share

అశ్వారావుపేట, జూన్ 27, మహా: ఖరీఫ్ సాగు సీజన్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల శ్రమను మోసం చేసే నకిలీ విత్తనాల ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. శుక్రవారం అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో సిరి ఫెర్టిలైజర్స్ మరియు రైతు మిత్ర సీడ్స్ & పెస్టిసైడ్స్ విత్తన దుకాణాల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విత్తనాల నిల్వల రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్సులు, ధరల వివరాలను సుదీర్ఘంగా పరిశీలించారు. అనుమానాస్పద అంశాలపై నిర్వాహకులను అడిగి విచారణ చేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి స్పష్టంగా హెచ్చరించారు. రైతుల ఆశలతో చెలగాటం ఆడే వారిని ఏమాత్రం వదిలిపెట్టం. వ్యవసాయ శాఖ నిబంధనలు పాటించకపోతే, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. రైతుల కోసం శ్రద్ధగా పనిచేస్తున్నాం అని తెలిపారు. ఈ తనిఖీల్లో పీఎస్ఐ అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.