Mahaa Daily Exclusive

  కార్మికుల జీవితాలను నిర్వీర్యం చేసే నాలుగు లేబరు కోడ్స్ ను రద్దు చేయాలి  జులై 9 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి  సిఐటియు జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు ..!

Share

నేలకొండపల్లి, జూన్ 27 మహా:

కార్మికుల జీవితాలను, వారి భవిష్యత్తును నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకురాలు బి కోటేశ్వరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జాతీయ కార్మిక సంఘాలు, స్కీం వర్కర్స్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వివిధ శాఖల అధికారులకు సమ్మె నోటీసు అందించి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. అనేక ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను హక్కులను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు కార్మికుల జీవితాలను ఫణంగా పెట్టిందని మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కార్మికుల పని గంటల విధానాన్ని 8 గంటల నుండి 10 గంటల వరకు పెంచి శ్రమదోపిడి చేస్తున్నారన్నారు. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నిరంకుశ విధానాలను నిరసిస్తూ జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు అన్ని వర్గాల ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చెరుకు శ్రీను, చల్లగుండ్ల నాగయ్య, బి ఆంజనేయులు, ప్రకాష్ బాబు, బొడ్డు పుల్లయ్య, స్టాలిన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.