భద్రాద్రి, కొత్తగూడెం జూన్ 27 (మహా) : సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించకుండా పక్క జిల్లాలకు తరలించడం సరికాదని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. ముందుగా భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలతో.. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఈనెల 30న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద జరిగే కాంగ్రెస్ ప్రభుత్వ పిండ ప్రధాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భద్రాద్రి జిల్లా రైతాంగం పై దృష్టి సారించాలని కోరారు. ఇటీవల ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద హెలికాప్టర్ లో వచ్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హంగు ఆర్భాటంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఏ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదన్నారు. ఇది చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనం అని, ఎక్కడైతే ఈ చేతకాని ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభించారో .. అక్కడే ఈనెల 30న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండప్రదానం చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండి వైఖరిని కొనసాగిస్తే జిల్లా రైతుల పక్షాన దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈనెల 30న ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు.








