Mahaa Daily Exclusive

  రేడియాలజీ లేకుండానే రిపోర్టు. * ల్యాబ్‌లలో ప్రాణాలతో చెలగాటం. * స్కానింగ్ కేంద్రాల పేరుతో నిలువు దోపిడీ…!

Share

ఖమ్మం, మహా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డయాగ్నస్టిక్‌, స్కానింగ్‌, రేడియాలజీ ల్యాబ్‌లలో సాగుతున్న రోగ నిర్ధారణ పద్ధతులు, అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు ఆసుపత్రుల ఆధిపత్యం అన్నీ కలసి ప్రజారోగ్యం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిపుణులేమీ లేకుండా, సరైన పరికరాలేమీ లేకుండా, అనుభవం లేని సిబ్బందితో కేవలం లాభాల కోసం రోగుల జీవితాలను ముప్పులోకి నెట్టడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియగా మారింది. ఆరోగ్యశాఖ మౌనంగా ఉండటం వల్ల ఈ వ్యవస్థ సమూలంగా చెల్లాచెదురైపోతుంది. ఇది ప్రస్తుత వ్యవస్థలో అత్యవసరంగా నిర్ధారణ, నియంత్రణ అవసరమయ్యే సమస్యగా గోచరిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 456 ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లు, 177 స్కానింగ్ సెంటర్లు, 48 రేడియాలజీ ల్యాబ్‌లు, 8 టుడీ ఎకో ల్యాబ్‌లు, 160 గైనిక్ ల్యాబ్‌లు అన్నీ కలిపి వేలాది రోగులకు రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నా… వాటి నాణ్యతపై ఎటువంటి గట్టి పర్యవేక్షణ కనబడడం లేదు. ల్యాబ్‌లు నడుస్తున్న తీరును పరిశీలిస్తే నిపుణుల సలహా లేకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడం, పరీక్షలు చేసిన సిబ్బంది పేర్లతోనే రిపోర్టులు ఇచ్చేయడం వంటివి కనిపిస్తున్నాయి. ఇది కేవలం వైద్య నైతికతకే కాదు… జాతీయ వైద్య మండలి నిబంధనలకు కూడా విరుద్ధం.

ఈ సమస్యకు ప్రధాన కారణం – డయాగ్నస్టిక్ సెంటర్ల వెనక ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల ఓనర్ల మద్దతు. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులే స్వయంగా ల్యాబ్‌లు నెలకొల్పడం వల్ల వీటిపై ఏ అధికారుల చేత పట్టుబడడం లేదు. రోగులు చికిత్స కోసం వెళ్తే లెక్కకు మించి టెస్టుల జాబితా రాస్తారు. ఆ టెస్టుల కోసం వెళ్లిన ల్యాబ్‌లు అత్యధిక రుసుములు వసూలు చేస్తూ, నాణ్యతలేని ఫలితాలను ఇస్తున్నాయి.

ఇదే విధంగా గర్భిణుల విషయంలో కూడా అంతే దురవస్థ. నెలకు కనీసం రెండుసార్లు స్కానింగ్ తప్పనిసరి కావడంతో గర్భిణులు ల్యాబ్‌ల వద్ద ఖర్చు కడతారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ సదుపాయం ఉన్నప్పటికీ ప్రైవేటు వైద్యుల మాటలకు లోబడి వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.

అలాగే, ఇటీవల ఖమ్మం , వైరా, సత్తుపల్లి, మధిర, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో అనుమతుల్లేని ల్యాబ్‌లను అధికారుల సీజ్ చేశారు. కానీ, అదే సమయంలో అనుమతుల్లేని మరెన్నో ల్యాబ్‌లు పట్టించుకోకుండా వదిలేయడం వ్యవస్థపైనే నమ్మకాన్ని తగ్గిస్తోంది. అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ సెంటర్లకు సామర్థ్యం ఉన్నప్పటికీ, అవి పెట్టకుండా పాత పరికరాలతోనే కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు.

దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారుల వాదనలు సైతం బలహీనంగానే ఉన్నాయి. పరిమిత సిబ్బంది, విచారణలపై ప్రెజర్ ఉన్నందున పూర్తి స్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నామన్నదే వారి సమాధానం. కానీ ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం చేసే వ్యవస్థకు తేలికపాటి న్యాయం కాదని ప్రజా సంఘాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి.
రోగ నిర్ధారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం, నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు జరగడం అన్నీ ప్రాథమిక అవసరాలు. ఇవి లేకుండా లాభాపేక్షతో ప్రైవేటు డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లు నడవడమే కాకుండా, వాటిపై అధికారుల మొగ్గు లేకపోవడం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. దీనికి గట్టి సమీక్ష, పారదర్శక తనిఖీలు, కఠిన చర్యలు తప్పనిసరిగా అవసరం. లేకపోతే ప్రజల ప్రాణాల మీద ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయి.