వైరా, మహా.
వైరా మున్సిపాలిటీ పరిధిలోని అనేక మంది నిరుపేదులు గతకాలంలోనే దరఖాస్తు చేసినప్పటికీ, ఇంతవరకు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని వాపోతున్నారు. తాము అన్ని అర్హతలు కలిగినవారమేనని, అయినప్పటికీ ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –
“అర్హతలున్న మాకు ఇళ్లు ఇవ్వకుండా, మధ్యవర్తుల మాద్యమంగా అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చాం. కానీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. అర్హుల్ని విస్మరిస్తూ, సంబంధాలు ఉన్నవారికి ఇళ్లు కేటాయించడమే న్యాయమా?” అని ప్రశ్నించారు.
నిజమైన అర్హులకే ఇళ్లు మంజూరు చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని, ప్రతి దరఖాస్తును సమీక్షించి న్యాయంగా అర్హతను నిర్ణయించాలని సూచించారు.
ఆందోళన అనంతరం, ప్రతినిధుల బృందం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార యంత్రాంగం మౌనంగా ఉండకుండా స్పందించి ప్రజల న్యాయహక్కులను కాపాడాలని వారు స్పష్టం చేశారు.
కమిషనర్ దరఖాస్తులన్నీ పరిశీలనలో ఉన్నాయని, అర్హులైనవారికి తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.








