వైరా, మహా.
వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గత 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రభుత్వం అందించే ఇండిరమ్మ ఇల్లు కోసం నిరీక్షిస్తున్న కొనకల్ల ఉషారాణి అనే మహిళ న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు “నీకు ఇండిరమ్మ ఇల్లు ఎలా వస్తుంది?” అంటూ ధిక్కరించి దూషించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న మాసకాలయిన జ్వరమూయి, బీపీ మాత్రలను ఒకేసారి మింగేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉషారాణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ – “నన్ను అర్హురాలిని అని గుర్తించకపోవడమే కాక, నాయకుల మాటలతో దౌర్జన్యంగా మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా అద్దె ఇంట్లో జీవిస్తున్న నాకు ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయమే” అని విలపించింది.
అర్హులకే ఇల్లు అందలేదన్న గ్రామస్థుల ఆరోపణ
గండగలపాడు గ్రామానికి ఇండిరమ్మ ఇళ్ల కేటాయింపులో అసమతుల్యతలు, రాజకీయ మలినాల ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. గ్రామానికి మొత్తం 64 మంది అర్హులు ఉన్నప్పటికీ, స్థానిక కమిటీ కేవలం 30 మందినే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపింది. ఆ జాబితాలో ఉన్న 30 మందిలోనూ కేవలం 20 మందికే ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో వాస్తవంగా అర్హులైన అనేకమంది నిరుపేదలు వెనక్కి నెట్టి పెట్టబడ్డారు.
ఈ నేపథ్యంలో గండగలపాడు గ్రామస్థులు శుక్రవారం వైరా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. “ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కొందరి చేతిలో ఒత్తిడులకు లోనవుతున్నాయి. అసలైన అర్హులకు మంజూరు కాక, రాజకీయంగా ప్రభావితులే లబ్ధిదారులవుతున్నారు” అంటూ మండిపడ్డారు.
మున్సిపల్ కమిషనర్‌కు గ్రామస్థుల వినతి
తమ సమస్యను వివరించేందుకు గ్రామస్తులు వైరా మున్సిపాలిటీ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జాబితా ప్రక్రియ పునఃపరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇకపై ఇల్లు అవసరమైనవారికే రావాలన్నారు. ఒక మహిళ ప్రాణాలతో చెలగాటం ఆటలాడే పరిస్థితి దాపురించిందంటే, వ్యవస్థల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించి వెంటనే విచారణ ప్రారంభించి బాధితురాలికి న్యాయం చేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా అర్హతను ప్రమాణంగా తీసుకుని ఇండిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు బలి కాకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం పెరిగిన నేపథ్యంలో… వైరాలో ఈ సంఘటన కలకలం రేపుతోంది.








