Mahaa Daily Exclusive

  పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలి….. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి..!

Share

ఖమ్మం,మహా.
పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.

అదనపు కలెక్టర్, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య రాకుండా మండలాల వారీగా ఎక్కడి నుంచి ఇసుక తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించి ఇసుక రీచ్ లను కేటాయించిందని అన్నారు.

మండలాల్లో ఎక్కడైనా ఇసుక తరలించే పాయింట్ అందుబాటులో ఉంటే ఆ వివరాలను తహసిల్దార్ అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు హౌజింగ్ శాఖ ఏఇ నుంచి ఏ సమయంలో ఎన్ని ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందో వివరాలతో లేఖ అందించాలని అన్నారు.

ఏఇ అందించిన లేఖ ఆధారంగా తహసిల్దార్ కూపన్ జారీ చేస్తారని, కూపన్ తో 3 రోజులలో సంబంధిత మండలానికి కేటాయించిన ఇసుక రీచ్ నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి ఉంటుందని, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంటాయని, స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్ లు నిర్వహిస్తున్నామని, ప్రతి ట్రాక్టర్ లోడ్ ఇసుకకు 200 రూపాయలు తహసిల్దార్ కార్యాలయం వద్ద చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

200 రూపాయలలో సగం వంద రూపాయలు మహిళా సంఘాలకు, 50 రూపాయలు స్థానిక గ్రామ పంచాయతీలకు, 50 రూపాయలు గ్రామీణ అభివృద్ధి శాఖకు వెళ్తాయని అన్నారు. ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే ఇసుక రీచ్ ల నుండి ఇసుక తరలించాల్సి ఉంటుందని అన్నారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపుపై అధికారులకు ఉన్న పలు సందేహాలను అదనపు కలెక్టర్ నివృత్తి చేశారు.

*విపత్తు నిర్వహణకు అవసరమైన సామాగ్రి ఏర్పాటుకు చర్యలు:

విపత్తు నిర్వహణ కోసం అవసరమైన పరికరాలు అందుబాటులో పెట్టెందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అన్నారు. టార్చ్ లైట్, లైఫ్ జాకెట్, స్పీకర్ మైక్ సెట్స్, బోట్లు, జిప్ కవర్, గజ ఈతగాళ్ళకు ఎంత వరకు అందుబాటులో ఉన్నాయో పరిశీలించాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఆపద మిత్ర, గజ ఈతగాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 24 సభ్యులతో కూడిన ఎన్.డి.ఆర్‌.ఎఫ్, 24 సభ్యులతో కూడిన ఎస్.డి.ఆర్‌.ఎఫ్ బృందాలను స్టేషన్ చేసి పెట్టామని అన్నారు.

ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా మైనింగ్ అధికారి సాయినాథ్, ఆర్డీవోలు నరసింహా రావు, ఎల్. రాజేందర్,డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, హౌజింగ్ ఏఇ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.