ఖమ్మం,మహా.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు ఆదేశించారు.
ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వివిధ శాఖల సంబంధిత అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి, సమస్యను పరిష్కరించడం వంటి లక్ష్యంతో కలిగిని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాలని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించాలని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేర్‌హోమ్‌కు తరలించే ప్రక్రియను దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ కోరారు.
ఆపరేషన్ ముస్కాన్ ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారని తెలిపారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార సముదాయాలు, గోదాములు, గోదాములు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ఆపరేషన్ ముస్కాన్-10లో
భాగంగా గతేడాది 79 మందికి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఈ ఏడాది అపరేషన్ స్మైల్ – 11 కార్యక్రమం ద్వారా 53 వెట్టి చాకిరీ నుండి రక్షించి 44 మంది బాలలను తల్లిదండ్రులు అప్పగించినట్లు తెలిపారు. మరో 9 మందిని రెస్క్యూ హోమ్ తరలించినట్లు తెలిపారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, సత్యనారాయణ (DEO), విజయ భస్కర్ రెడ్డి, (డిప్యూటీ కమిషనర్ ,కార్మిక శాఖ) టి. విష్ణు వందన (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) డాక్టర్ చందన (నోడల్ ఆఫీసర్ హెల్త్ డిపార్ట్‌మెంట్)అనిత (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు) ఇన్స్‌పెక్టర్ స్వామి పాల్గొన్నారు.








