పెనుబల్లి,మహా.
గ్రౌండింగ్ అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు, పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామాల్లో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతి ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. లబ్దిదారులతో సమస్యలు ఉన్నాయా, ఇసుక ఉచితంగా ఇస్తున్నారా, అధికారుల సహకారం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వంద శాతం చేయాలన్నారు. ముగ్గు వేయించి, రికార్డు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి మండలానికి 576 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 467 ఇండ్లు నిర్మాణాలు ప్రారంభం అవగా, పెనుబల్లి మండలంలో 612 మంజూరయిన ఇండ్లలో 541 ఇండ్లు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
మండలానికి ఎంత మేర ఇసుక, మట్టి అవసరమో, ముందుగానే డంప్ చేసుకోవాలని, ఎఇ ద్వారా సంబంధిత తహసీల్దార్ కూపన్లు జారీచేస్తారని, అట్టి కూపన్లతో లబ్ధిదారులు పొందవచ్చని అన్నారు. ప్రతి సోమవారం నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులకు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు.
కొత్తూరు గ్రామంలోని రేకుల కాలనీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని, ఇందిరమ్మ ఇండ్ల కాలనిగా రూపుదిద్దుకోవాలని కలెక్టర్ అన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకొని గృహ ప్రవేశానికి పిలవాలని లబ్దిదారులతో అన్నారు.
కలెక్టర్ క్షేత్ర పరిశీలన సందర్భంగా కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, ఎంపిడివో లు నాగేశ్వరరావు, అన్నపూర్ణ, తహశీల్దార్లు సత్యనారాయణ, నారాయణ మూర్తి, హౌజింగ్ ఏఇ లు పవన్ కళ్యాణ్, కమల్, అధికారులు, తదితరులు ఉన్నారు.








