Mahaa Daily Exclusive

  జిల్లాలోని అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (మహా):
జిల్లాలోని అన్ని మండలాల ఎంపిటిసిలు మండల పంచాయతీ ఎఇలు మరియు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం ఎపిఓలతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన యావరేజ్ పేజ్ రేట్ కు సంభందించి కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మండలాలలో ఉపాధి హామీ పథకం వేతనదారులకు అధిక వేతనం పొందేందుకు కనీసం రోజుకు 5 నుండి 6 గంటలు పనిచేసేటట్లు చూడాలని, సరైన మార్కింగ్ ద్వారా కనీస వేతనం రోజుకు 300 రూపాయలు వచ్చేటట్లు చూడాలని, గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలకు స్థలాలు గుర్తించిన వాటిని వెంటనే పని ప్రారంభించాలని, స్థలాలు గుర్తించని వాటికి వెంటనే గుర్తించాలని, ఎంపిడిఓ లకు ఆదేశాలు జారీచేశారు. రాబోయే వారం రోజుల లోపల ఉపాధి హామీ పథకం షోషల్ ఆడిట్ పేరాలకు సంబంధించిన రిప్లైలు పంపించాలని, అలాగే వనమహోత్సవ కార్యక్రమములో మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇరిగేషన్ చెందిన కెనాల్స్ నందు ఇరువైపులా పెద్ద స్థాయిలో (10 వరుసలలో) మొక్కలు నాటించాలని, ప్రతినర్సరీలలో ఖాళీ సంచులలో ఈత, తాటి మొక్కలు పెంచాలని అధికారులను ఆదేసించారు. జిల్లాలోని ఉపాధి హామీ పథకము వేతనదారులకు మరియు స్వయం సహాయక సభ్యులను ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పాలసీల నందు నమోదు చేయించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం అన్ని పనులు అనగా రోడ్ల నిర్మాణాలు, భూమి అభివృద్ధి పనులు మొదలైన పనులను ఇజియస్ నియమ నిబంధనల ననుసరించి చేపట్టాలని, లేనియెడల క్రమశిక్షణా చర్యలు తీసుకొన బడతాయని హెచ్చరించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్-|| లో భాగంగా కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ జిల్లాలో 16 మంజూరి చేశారు. అందులో 4 మాత్రమే పని ప్రారంభించాయని, మిగిలిన 12 పనులను 3 రోజులలో ప్రారంభించ వలసినదిగా ఆదేశించారు. 429 డ్రైన్ యండ్ కమ్యూనిటి సోక్ పిట్స్ మంజూరి అయ్యాయని, వీటిని వారం రోజులలో ప్రారంభించవలసినదిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్, 2025 సర్వే లో భాగంగా అన్ని ఇండ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని, గ్రామాలలో పరిసరాల పారిశుధ్యాన్ని మెరుగు పరచాలని, పంచాయితీలలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేసారు. అలాగే పారిశుద్యం పై జరిగే సర్వే లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతూ వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా తెలియజేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో యం. విద్యాచందన, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇంచార్జి మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, బి. నాగలక్ష్మి, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, జిల్లా ప్రజా పరిషత్, శ్రీనివాసరావు, జిల్లా పంచాయితీ ఇంజనీరింగ్ అధికారి, సత్యనారాయణ, ఇఇ పి ఆర్, భద్రాచలం డివిజన్, యన్. రవి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మరియు అందరు ఎంపిడిఓ లు, మండల పి ఆర్ ఎఇ లు మరియు ఉపాధి హామీ పథకం ఎపిఓ లు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.