Mahaa Daily Exclusive

  భర్తలను బలికొంటున్న అక్రమ సంబదాలు ప్రియుడితో కలిసి భార్య.. భర్త పై హత్యాయత్నం నగరంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసు.. ఛేదించిన మట్వాడ పోలీసులు..!

Share

వరంగల్ మహా ;

ఇటీవల అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కొంతమంది వివాహిత మహిళలు పేగు బంధం, ఆప్యాయత మానవత్వాన్ని మరిచి క్షణికావేశంలో అడ్డుగా ఉన్న తన కుటుంబ సభ్యులతో పాటు భర్తను కూడా చంపడానికి వెనుకాడం లేదు. ఇటీవల ఇలాంటి దారుణమైన సంఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను హతమార్చాలని భార్య, ఆమె ప్రియుడితో కలిసి పన్నిన దారుణమైన కుట్రను మట్వాడ పోలీసులు ఛేదించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ ఎన్ కరుణాకర్ రావు నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి కీలక సాక్ష్యాలతో పాటు కొంత డబ్బును, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాలిలా

కరీంనగర్ జిల్లా.. మోత్కుల గూడెం, జమ్మికుంటకు చెందిన పోతుల సందీప్ (29) అనే ప్రైవేట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కర్‌ కు, వరంగల్‌ కు చెందిన గంగరబోయిన పద్మ (37)తో మూడు సంవత్సరాల క్రితం వరంగల్ బస్టాండ్ వద్ద పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. పద్మ భర్త రాజు లేని సమయంలో సందీప్‌ తో ఆమె ఈ సంబంధాన్ని కొనసాగించింది.

చిట్టీ వివాదంతో బట్టబయలైన సంబంధం

సందీప్ వద్ద రాజు లక్ష రూపాయల చిట్టీ వేశాడు. ఈ క్రమంలో సందీప్, తన భార్య మధ్య ఉన్న అక్రమ సంబంధం కాస్త రాజుకు తెలిసిపోయింది. దీంతో భార్య పద్మ, సందీప్‌ల మీద అనుమానం పెరిగి, ఈ విషయం వివాదానికి దారితీసింది.
తమ అక్రమ సంబంధానికి భర్త రాజు అడ్డు వస్తున్నాడని భావించిన సందీప్, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులైన బబ్లు, షబ్బీర్, స్వర్ణాకర్‌ లతో కలిసి రాజును వరంగల్ పోతనగర్ డంప్ యార్డ్‌కు పిలిపించి, మద్యం తాగించి రాజు పై దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించగా అటువైపు నుండి వచ్చిన స్థానికులు రాజు అరుపులు విని వారి వద్దకు రాగా సందీప్ తన స్నేహితులతో కలిసి కారులో పారిపోయారు. స్పృహ కోల్పోయిన రాజును వారి కుటుంబ సభ్యులు మొదట ఎంజిఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రాజు ఆరోగ్యం సహకరించక పోవడంతో గార్డెన్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రూ. 9 లక్షలతో పరారీ

హత్యా ప్రయత్నం తర్వాత, పద్మ తన ఇంటి నుంచి 9 లక్షల రూపాయలను తీసుకుని సందీప్‌తో కలిసి పరారైంది. ఈ డబ్బులో సందీప్‌కు సాయం చేసిన ముగ్గురు స్నేహితులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున మొత్తం 3 లక్షలు ఇచ్చిందని సమాచారం.

నిందితుల అరెస్ట్, నగదు స్వాధీనం

ఆదివారం ఉదయం మట్వాడ ఎస్సై బి శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, TS-11-UC-0178 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న సందీప్, పద్మలను గుర్తించి పట్టుకున్నారు. వారిని విచారించగా హత్యా యత్నం, డబ్బుతో పరారైన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ. 5,40,000 నగదు, హత్యాయత్నానికి ఉపయోగించిన కారు, రెండు స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న వివరాలను
మట్వాడ సీఐ ఎన్ కరుణాకర్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్యాయత్నం సంఘటన ఇప్పుడు వరంగల్ నగరంలో చర్చనీయాంశంగా మారింది.