Mahaa Daily Exclusive

  ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నస్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సుందిళ్ల నరేందర్, సుందిళ్ల రాజమ్మ, సుందిళ్ల సులోచన లు తమ కుటుంబ పెద్ద పేరిట నస్పూర్ శివారులో గల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం పెద్దనపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన సఫియా, అబ్దుల్ బి తాము ప్రభుత్వ జి.ఓ.59 ప్రకారం తమ భూమి క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ రుసుము చెల్లించామని, పట్టా మంజూరు చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి, సుబ్బారావు పల్లి గ్రామానికి చెందిన హనుమాండ్లు తమ కుటుంబం గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో తాను 25 సంవత్సరాల క్రితం టేకు చెట్లు నాటి సంరక్షించానని, వాటిని తొలగించి వ్యవసాయ సాగు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ మంద అనిత తన దరఖాస్తులో తమ గ్రామంలోని ఎర్రకుంట చెరువు పై ఆధారపడి రైతులు, మత్స్యకారులు జీవించేవారని, కొంతమంది రియల్ ఎస్టేట్ వారు అక్రమంగా చెరువుకి గండి కొట్టి భూముల ఆక్రమణకు పాల్పడడంతో ఎంతో నష్టం జరుగుతుందని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి చెరువు పునరుద్ధరించి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ గ్రామానికి చెందిన వైశాలి తన కుమారుడు ఇచ్చోడలోని గురుకుల బాలుర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడని, తనని జిల్లాలోని కాసిపేట/ ఇతర గురుకులాలలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టడానికి చెందిన దూట లక్ష్మణ్ తాను గతంలో కొనుగోలు చేసిన భూమికి భూ భారతి చట్టం ప్రకారం పట్టా మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.