Mahaa Daily Exclusive

  రియల్ బాద్ షా హైదరాబాద్.. భూముల వేలాల్లో.. తగ్గేదెలే అంటున్న బిడ్డర్లు..

Share

  • కూకట్ పల్లి హౌజింగ్ బోర్డుస్థలానికి రికార్డు ధర
  • 1.50 లక్షల రేటును పోటీపడి.. డబుల్ చేసిన బిడ్డర్లు
  • హైదరాబాద్ స్థలాలకు తీవ్ర పోటీ

 

హైదరాబాద్, మహా

హైదరాబాద్ లో రియల్ బూమ్.. ట్రాక్ ఎక్కింది. ఇక తగ్గేదెలే అంటోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇటీవల రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు పలికి దేశవ్యాప్తంగా వావ్ అంటూ ఉలిక్కిపడేలాచేసింది. గతంలో కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు పలకగా.. సర్కార్ వేలంలో ఇటీవల రాయదుర్గంలోని 7 ఎకరాల బిట్ రికార్డు స్థాయిలో ఎకరం రూ.177 కోట్ల చొప్పున పలికింది. ఇపుడు కూకట్ పల్లి హౌసింగ్‌ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధిలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలం ఈ-వేలంలో రికార్డు రేటు పలికింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ స్థలానికి బుధవారం నిర్వహించిన ఈ-వేలంలో అంచనా వేసిన దానికంటే అధిక ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రాజీవ్ రోటరీ సమీపంలో.. ఒక నాలాను ఆనుకుని ఉన్న 726 గజాల స్థలాన్ని హౌసింగ్ బోర్డు వేలం వేసింది. హౌసింగ్‌ బోర్డు ఈ స్థలానికి బేస్ ప్రైస్ గజానికి రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది. అయితే వేలంలో బిడ్డర్లు తీవ్రంగా పోటీపడటంతో.. చివరికి ఆ స్థలం గజానికి రూ.2,47,500 చొప్పున అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.17,96,85,000 ఆదాయం సమకూరింది.

 

 

హైదరాబాద్ రియల్ డిమాండ్ తగ్గేదెలే

 

జనావాసాలు ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ వంటి అత్యంత కీలకమైన వాణిజ్య, నివాస ప్రాంతంలో ప్రభుత్వ స్థలానికి ఇంత పెద్ద ధర పలకడం.. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ప్రధాన రహదారికి దగ్గరగా, కీలకమైన జంక్షన్‌కు సమీపంలో ఉండడం ఈ స్థలం విలువను పెంచింది. ఈ-వేలం నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం లభించింది. హౌసింగ్‌ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ఈ-వేలంలో స్థలాలను కొనుగోలు చేయడానికి ప్రజలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ భూములతో పోలిస్తే ప్రభుత్వ స్థలాలకు అధిక డిమాండ్ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములకు సాధారణంగా యాజమాన్య పత్రాలు (టైటిల్ డీడ్స్) స్పష్టంగా పారదర్శకంగా ఉంటాయి. ప్రైవేట్ స్థలాల్లో తరచూ తలెత్తే కోర్టు కేసులు, భూ వివాదాలు, వంటి చిక్కులు ప్రభుత్వ స్థలాల్లో దాదాపుగా ఉండవు. ఇది కొనుగోలుదారులకు భద్రతా భావాన్ని కలిగించి, పెట్టుబడిపై పూర్తి విశ్వాసం ఏర్పరుస్తుందని చెబుతున్నారు. కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ వంటి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలకు రికార్డు ధరలు పలకడానికి ఇది ముఖ్య కారణంగా నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రసర్కారు వేలాలకు ఇపుడు ఎన్నడూ లేని రీతిలో స్పందన కనిపిస్తుండడంతో ఇక రియల్ రంగానికి మళ్ళీ పాతరోజులు వస్తున్నాయని క్రయవిక్రయదారులు సంతోషపడుతున్నారు.