Mahaa Daily Exclusive

  భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయడం లేదు..

Share

  • హర్మూజ్‌లో రక్షణ కల్పిస్తాం.. అమెరికాకు మా సత్తా ఏంటో తెలుసు.
  •  ఇరాన్ రాయబారి మహమ్మద్‌ ఫతాలీ.

ఢిల్లీ, మహా.

 

హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే భారత చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎటువంటి టోల్‌ వసూలు చేయడం లేదని భారత్‌లో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ స్పష్టం చేశారు. భారత నౌకల నుంచి ఇరాన్ టోల్‌ వసూలు చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రిని పునరుద్ఘాటించిన ఆయన, హర్మూజ్‌లో భారత నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలోనూ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇరాన్ కట్టుబడి ఉందని, భారత్‌తో ఉన్న సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన వివరించారు.

మరోవైపు అమెరికాతో సంబంధాలపై ఇరాన్ తన వైఖరిని కఠినతరం చేసింది. వాషింగ్టన్ తన చట్టవిరుద్ధమైన డిమాండ్లను పక్కనపెట్టి, టెహ్రాన్ విధించిన షరతులకు కట్టుబడి ఉంటేనే మరో విడత శాంతి చర్చలకు సిద్ధమని ఫతాలీ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగియడానికి అమెరికా మొండివైఖరే కారణమని ఆయన ధ్వజమెత్తారు. అగ్రరాజ్యం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా డిమాండ్లు చేయడం వల్లే చర్చలు విఫలమయ్యాయని ఆరోపించారు.

ఇదే క్రమంలో హర్మూజ్ జలసంధి వ్యవహారంలో గతంలో వచ్చిన హెచ్చరికలపై రాయబారి ఘాటుగా స్పందించారు. ఇరాన్ రక్షణ సామర్థ్యాల గురించి వాషింగ్టన్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. హర్మూజ్ జలసంధి ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లోనే ఉందని, తమ జలాలను కాపాడుకోవడానికి తమకున్న సార్వభౌమ హక్కులను ఖచ్చితంగా వినియోగించుకుంటామని హెచ్చరించారు. ప్రాంతీయ భద్రత విషయంలో తమ సామర్థ్యంపై అమెరికాకు ఎటువంటి సందేహాలు లేవని, తమ ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.

Latest