- మావోయిస్టు ఏరియా కమాండర్ భాగ్య మృతి.
- రూపిపై రూ.25 లక్షల రివార్డు.
- ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మరో పది మంది మావోయిస్టులు.
- కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.
రాయ్‌పూర్,మహా.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, పార్దాపూర్ ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్య మృతి చెందారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై అందిన పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఇరువర్గాల మధ్య పోరు నెలకొంది. ఈ కాల్పుల్లో భాగ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది మావోయిస్టులు అడవుల్లోకి తప్పించుకున్నట్లు సమాచారం. మృతి చెందిన భాగ్యపై ప్రభుత్వం గతంలోనే రూ.25 లక్షల భారీ రివార్డును ప్రకటించింది.
భాగ్య నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆమె మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీలకంగా పనిచేశారు. 2004లో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితురాలై ఆమె అడవి బాట పట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత కఠినమైన అబూజ్మడ్ అటవీ ప్రాంతాల్లో ఆమె దళ సభ్యురాలిగా, కమాండర్‌గా విధులు నిర్వర్తించారు. భాగ్య మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్య. విజయ్ రెడ్డి గత ఏడాది (2025) మాన్పూర్ జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. భర్త మరణం తర్వాత కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఏరియా కమాండర్ స్థాయికి ఎదిగారు.
భాగ్య మృతి వార్త తెలియడంతో ఆమె స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఒకప్పుడు చురుగ్గా ఉండే యువతి ఇలా ఎన్‌కౌంటర్‌లో మరణించిందని తెలిసి గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే భాగ్య తండ్రి నర్సయ్య మరణించగా, ప్రస్తుతం తల్లి లక్ష్మి, సోదరి గ్రామంలోనే నివసిస్తున్నారు. తమ బిడ్డ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. కూతురు మరణవార్త విని తల్లి లక్ష్మి, సోదరి బోరున విలపిస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇంటి నుంచి వెళ్లిన భాగ్య, చివరకు విగతజీవిగా మారడం ఆ గ్రామంలో విషాద వాతావరణాన్ని నింపింది.







