- ఈసారి వర్షపాతం 92 శాతమే.
- తగ్గుముఖం పట్టనున్న వానలు.
- నిరాశపరుస్తున్న రుతుపవనాలు.
- లోటు వర్షపాతమే శరణ్యం.
హైదరాబాద్, మహా.
**భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్ నినో’ నీలినీడలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా కోట్ల మంది అన్నదాతల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 వానాకాలం సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం విడుదల చేసిన తన తొలి విడత దీర్ఘకాలిక అంచనాలో స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా ముదురుతున్న ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో వర్షాలు ముఖం చాటేసే ప్రమాదం ఉందని, ఇది ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు**
దేశవ్యాప్తంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే నాలుగు నెలల రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా అంటే సుమారు 92 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. గడిచిన 30 ఏళ్ల సగటు 868.6 మిల్లీమీటర్లుగా ఉండగా, ఈసారి సుమారు 800 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసే వీలుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ నమూనాల విశ్లేషణ ప్రకారం, ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా (90-95%) ఉండటానికి 31 శాతం అవకాశం ఉండగా, అసలు లోటు వర్షపాతం (90% కంటే తక్కువ) నమోదయ్యేందుకు ఏకంగా 35 శాతం వరకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది గడిచిన 25 ఏళ్లలో ఐఎండీ విడుదల చేసిన తొలి విడత అంచనాల్లో అత్యంత తక్కువ స్థాయి కావడం గమనార్హం.
ఈ లోటు వర్షపాతానికి ప్రధాన శత్రువు పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్ నినో పరిస్థితులేనని వాతావరణ శాఖ విశ్లేషిస్తోంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న సముద్ర ఉష్ణోగ్రతలు జూలై నాటికి ఎల్ నినోగా మారి, రుతుపవనాల రెండో సగభాగంలో వానలను అడ్డుకునే ప్రమాదం ఉంది. నెలవారీ అంచనాలను పరిశీలిస్తే, జూన్ మాసంలో రుతుపవనాల రాక సాఫీగా ఉండి 101 శాతం వర్షపాతం నమోదైనప్పటికీ, జూలైలో 95 శాతం, ఆగస్టులో 92 శాతం మరియు సెప్టెంబరులో అత్యల్పంగా 89 శాతానికి పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా, పంట ఎదుగుదలకు అత్యంత కీలకమైన చివరి దశలో అన్నదాతకు వానగండం తప్పేలా లేదు.
ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతం , వాయువ్య రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానా ప్రాంతాల్లో వర్షపు కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే వీలుందని ఐఎండీ సానుకూల సంకేతాలు ఇచ్చింది. అలాగే హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఇండియన్ ఓషియన్ డైపోల్ పరిస్థితులు సీజన్ చివరిలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఇది ఎల్ నినో ప్రభావాన్ని కొంత మేర అడ్డుకుని వరుణుడిని కరుణించేలా చేసే ‘బూస్టర్’గా పనిచేస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షపు కొరత దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా గ్రామీణ వినియోగం మరియు ఆహార ద్రవ్యోల్బణంపై గొడ్డలిపెట్టుగా మారనుంది. వరి, పప్పుధాన్యాలు మరియు నూనె గింజల సాగుపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మార్కెట్లో ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, జనవరి నుండి మార్చి వరకు ఉత్తర గోళార్థంలో మంచు విస్తీర్ణం సాధారణం కంటే తక్కువగా ఉండటం రుతుపవనాలకు కొంత మేర మేలు చేసే అంశంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడే అప్రమత్తమై నీటి నిల్వలు , ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.







