తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక -2035
= కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన పుస్తకం
=ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ
హైదరాబాద్, మహా: కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక -2035’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడానికి 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు, విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డి. రాజిరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తి పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్దేశించారు.
ఏటా 1341 కోట్ల రూపాయల ఉత్పత్తి..
వచ్చే ఐదేళ్లలో రూ. 921.40 కోట్ల సాగు పెట్టుబడి, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడి విస్తీర్ణం పెంచగలిగితే 1 రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభాలకు అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఎస్కేఎల్టీహెచ్యూ రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా 1341 కోట్ల రూపాయల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా తీసుకుని కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు, అందుకు అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్ర వివరించారు.







