- రిజర్వేషన్ల జీవోతో కొత్త నాటకం
- ఆరు గ్యారెంటీల లాగే బీసీ రిజర్వేషన్ల డ్రామా
- ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టండి.. కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమే
- మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే జారీ చేయడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని విమర్శించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టండి.. కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధం అన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు హైకోర్టు ఆదేశాలతో పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు అని హరీష్ రావు ఆరోపించారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపాలి..
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి.. దీన్నీ తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు అని విమర్శించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపాలని, మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేయించి, షెడ్యూల్ 9లో చేర్చండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని నిలదీస్తుందన్నారు.







