- భగ్గుమన్న బీసీ సంఘాలు
- నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
- బీజేపీ, బీఆర్ఎస్ లపై కాంగ్రెస్ భగ్గు
- కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కౌంటర్
(హైదరాబాద్ – మహా)
బీసీలకు అందినట్టే అంది నిలిచిన 42శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు తీవ్రంగా రియాక్టయ్యాయి. శుక్రవారం రాష్ట్రబంద్ తో పాటు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు ఏడాదిన్నర కాలంగా బీసీ కులగణన, రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్ణయంతో షాక్ కు గురికాగా, బీజేపీ బీఆర్ ఎస్ కుట్ర వల్లే స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, ఇది తమ కమిట్ మెంట్ అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్నపుడు తొందరపడి జీవో ఎందుకిచ్చారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ప్రశ్నించారు. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
……..
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రే
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుందని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టమే బీసీలకు ఉరితాడుగా మారిందన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం తెచ్చింది కేసీఆరేనన్నారు. గురువారం గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం… తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది. ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బీఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటే ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు…బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.
…
బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే
ఎన్నికలకు వెళ్తాం
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్ :
బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అందరికీ తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వాళ్లు గమనిస్తున్నారని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బీఆర్ఎస్లకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగిందని, బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీలను బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీల నోటి కాడి ముద్ద లాక్కున్నారని, తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ కాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసి అడుగడుగున బీసీలను అణగదొక్కిందని ఫైర్ అయ్యారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆదిశగా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు, పార్టీ అంత ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామని.. బీసీ సంఘాలు కుల సంఘాలు ధర్నా చేస్తే బీజేపీ, బీజేపీ లు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని, బీసీ రిజర్వేఫన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. డిల్లీలో పోరాడినప్పుడు మీరు ఎక్కడ తోక ముడుచుకొని తలదాచుకున్నారు? అని నిలదీశారు. కోర్టులో పోరాటం చేస్తుంటే ఎందుకు మీరు ఇంప్లీడ్ కాలేదు. బీసీలకు వ్యతిరేకంగా ఉన్న మీరు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు అని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.
………
కాంగ్రెస్ వల్లే కోర్టులో స్టే
బీజేపీ చీఫ్ రామచందర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే విందించేందుకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని అసెంబ్లీలో బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు పూర్తి మద్దతు ఇచ్చామన్నారు. అలాగే బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు బిల్లు పంపి 3 నెలలు కూడా ఓపిక పట్టలేదని, జీవో ఇచ్చి షెడ్యూల్ ప్రకటించడంలో లోగుట్టు ఏంటని ప్రశ్నించారు. కోర్టు స్టేకు ప్రభుత్వానిదే బాధ్యత అని మాపై అబండాలు వేయవొద్దన్నారు.
….
మా నోటికాడి
అన్నం ముద్ద లాక్కున్నారు
-జీవోపై స్టే విధించడం చాలా దురదృష్టకరం
=రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. హైకోర్టు వద్ద ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రక్రియను రెండు వారాల పాటు ఆపడమనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారు. మొన్న నుంచి విచారణ జరిపిన కోర్టు.. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండే. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందన ఏంటో చూస్తాం. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి రాష్టాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బీసీల్లో ఎంతో చైతన్యం వచ్చింది.. ఊరూరా స్పందన తెలుపుతాం. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. సాయంత్రంలోగా ప్రకటించాలి. లేదంటే పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తాం. దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుంది. ఏం తమాషాగా ఉందా..? బీసీలంటే అంత చులకనగా ఉందా..? ముఖ్యమంత్రి పదవులు రావు మంత్రి పదవులు రావు.. లేక లేక సర్పంచ్ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
….
అందరం వెళ్లి ప్రధాని ఇంటి ముందు కూర్చుందాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల
బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ఇంటి ముందు కూర్చుందాం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే తామూ వెంట వస్తామని వెల్లడించారు. ప్రధానిని కలవడమే దీనికి పరిష్కారమని.. 42 శాతంపై వెనక్కి పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 42 శాతం అమల్లోకి వచ్చాకనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని.. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టంగా చెప్పామని అన్నారు. జీవో ద్వారా సాధ్యం కాదని.. రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పామని.. అయినా పట్టించుకోలేదని అన్నారు. బీసీలను అవమానం చేసేలా వ్యవహరించారని.. జీవో న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్‌రెడ్డి జీఓ ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
…..







