- మంత్రులను కలిసిన నవీన్ యాదవ్
- తన గెలుపులో కీలక పాత్ర పోషించారంటూ కృతజ్ఞతలు
- అసదుద్దీన్ ఓవైసీని కలిసిన థ్యాంక్స్ చెప్పిన నూతన ఎమ్మెల్యే
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా.. నవీన్ యాదవ్ వరుసగా రాష్ట్ర మంత్రులను కలుస్తున్నారు. మంత్రులతో సమావేశమై వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం సాధించినందుకు వారు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.
అసదుద్దీన్ ఓవైసీని కలిసిన నవీన్ యాదవ్..
అనంతరం ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపఎన్నికలో ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్‌కి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ విజయంలో పార్టీ పోషించిన కీలక పాత్రను నవీన్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి పుష్పగుచ్ఛం అందించి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు, మైనార్టీల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా నవీన్ యాదవ్ అన్నారు.








