Mahaa Daily Exclusive

  మహారాష్ట్రలో సంచలనం….మహారాష్ట్రలో సైబర్ మృగాడి అరాచకం: 180 మంది బాలికలపై అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్

Share

మహారాష్ట్రలో సంచలనం.
*180 మంది బాలికలపై ‘సైబర్’ దాడి.
* 350 అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్.
* కామాంధుడి అరాచకం వెలుగులోకి.
*బీజేపీ ఎంపీ అనిల్ బోండే ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్.
* మొబైల్‌లో వందల కొద్దీ అసభ్యకర చిత్రాల గుర్తింపు.

ముంబయి, మహా.
మహారాష్ట్రలో వెలుగుచూసిన ఒక అమానవీయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని ఒక యువకుడు ఎంతటి ఘోరానికి ఒడిగట్టవచ్చో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. దాదాపు 180 మంది అమాయక బాలికలను ప్రేమ పేరుతో వంచించి, వారిని వేధించడమే కాకుండా వందల కొద్దీ అశ్లీల వీడియోలను చిత్రీకరించిన ఒక ‘సైబర్ మృగాడి’ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడి వద్ద లభించిన డిజిటల్ ఆధారాలు చూసి విచారణాధికారులే విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో 350కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘోరానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, అమరావతి జిల్లా పరాత్వడకు చెందిన నిందితుడు చిన్నారులు, యువతులే లక్ష్యంగా వల విసిరాడు. ప్రేమ పేరుతో వారిని లోబర్చుకుని ముంబయి, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి, అక్కడ వారికి తెలియకుండానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆపై ఆ అశ్లీల వీడియోలను చూపిస్తూ బాధితులను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా కొన్ని వీడియోలను ఆన్‌లైన్ వేదికలపై షేర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దారుణంపై బీజేపీ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం రచ్చకెక్కింది. బాధితుల తరఫున ఆయన గళమెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ ముమ్మరం చేశారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలీసులు సైబర్ సెల్ సహాయంతో నిందితుడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇంకా ఎంతమంది ఈ మృగాడి చేతిలో మోసపోయారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, బాలికల భద్రత కోసం కఠినమైన చట్టాలు అమలు చేయాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పక్షాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Latest