Mahaa Daily Exclusive

  తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్…

Share

  • తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
  • 3 రోజులు మాడు పగిలే ఎండలు
  • ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మహా : భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఎండల తాకిడి పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రతకు జనం బయటికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే అధికంగా ఎండలు ఉండటంతో జనం మధ్యాహ్నం పూటే బయటికి రావాలంటే భయపడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు తెలంగాణ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రానున్న 3 రోజులకు ఆరెంజ్‌ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ఠంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నారాయణపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచాయని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న జిల్లాలకు ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట అసలు బయటికి రావొద్దని హితవు పలికింది.

Latest