భారతీయ అంతరిక్ష స్టేషన్‌కు రష్యా తోడు.
* సరికొత్త వ్యూహానికి ఇస్రో శ్రీకారం.
*ఒకే కక్ష్య.. ఉమ్మడి సాంకేతికత.
* అంతరిక్ష రంగంలో భారత్-రష్యాల చెరగని బంధం.
*చైనా ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట.
* ఐఎస్‌ఎస్ తర్వాతి శకానికి భారత్ సన్నద్ధం.
బెంగళూరు, మహా.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పదవీ విరమణకు సిద్ధమవుతున్న తరుణంలో, నింగిలో సరికొత్త ఆధిపత్య పోరుకు తెరలేచింది. భవిష్యత్తులో నిర్మించబోయే అంతరిక్ష కేంద్రాల కోసం భారతదేశం మరియు రష్యా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ , రష్యా నిర్మించ తలపెట్టిన ‘రష్యన్ ఆర్బిటల్ స్టేషన్’ మధ్య సాంకేతిక మార్పిడి, ఉమ్మడి నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక అడుగులు పడ్డాయి. ఈ పరిణామం అంతరిక్ష రంగంలో ఒక నవ శకానికి నాంది కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో చైనా ఏకైక చురుకైన స్టేషన్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో, భారత్-రష్యాల ఈ ఉమ్మడి అడుగు వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. ఆశ్చర్యకరంగా రష్యా తన స్టేషన్ కోసం ఎంచుకున్న 51.6 డిగ్రీల వంపును భారత్ కూడా ఎంచుకోవడం వెనుక లోతైన సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమానమైన కక్ష్య కారణంగా భవిష్యత్తులో రెండు స్టేషన్ల మధ్య సత్సంబంధాలు మరియు సహాయ సహకారాలు అందించుకోవడం సులభతరం కానుంది. ముఖ్యంగా కంట్రోల్ మరియు పవర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ మరియు ట్రాకింగ్ వ్యవస్థలతో పాటు డాకింగ్ ఇంటర్‌ఫేసెస్‌ను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. దీనివల్ల ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు వ్యోమగాములను తరలించడం, అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం మరియు కార్గో లేదా ఇంధన మార్పిడి వంటివి అత్యంత సులభతరమవుతాయి.
భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని 5 మాడ్యూళ్లతో, సుమారు 54 టన్నుల బరువుతో నిర్మించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మహా యజ్ఞంలో భాగంగా మొదటి మాడ్యూల్ నిర్మాణం మరియు ప్రయోగానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1,763 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. 2025 నుంచి 2028 మధ్య కాలంలో ఈ మొదటి అడుగు పడనుంది. ఐఎస్‌ఎస్ సేవలు ముగిసే నాటికి భారత్ తన స్వయంప్రతిపత్తిని చాటుకుంటూనే, రష్యా వంటి అనుభవజ్ఞులైన మిత్రదేశాల సహకారంతో నింగిలో తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరమైన ప్రగతి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ అంతరిక్ష రాజకీయాల్లో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టే దిశగా సాగుతున్న మహా ప్రస్థానమని అంతరిక్ష శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. రాబోయే దశాబ్ద కాలంలో ఈ రెండు స్టేషన్లు అంతరిక్ష పరిశోధనల గమనాన్ని మార్చబోతున్నాయి.








