Mahaa Daily Exclusive

  విమాన ప్రయాణికులకు పండగే.. !

Share

  • విమాన ప్రయాణికులకు పండగే.. !
  • టికెట్ క్యాన్సిల్ చేస్తే 80% డబ్బులు వాపస్!
  •  కేంద్రం సంచలన నిర్ణయం.
  • విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు.

హైదరాబాద్, మహా.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. విమాన ప్రయాణం అంటేనే జేబుకు చిల్లు అనే భయం ఒకవైపు.. అనుకోని పరిస్థితుల్లో చివరి నిమిషంలో ప్రయాణం రద్దయితే కట్టిన డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా అనే ఆందోళన మరొకవైపు. ఇన్నాళ్లూ విమాన ప్రయాణికులను పట్టి పీడిస్తున్న ఈ టెన్షన్ కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా భారీ మొత్తంలో రీఫండ్ పొందేలా కేంద్ర పౌర విమానయాన శాఖ సరికొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. రాబోయే రెండు మూడు నెలల్లోనే ఈ సంచలన విధానం అమలులోకి రానుంది.

*టికెట్ రద్దయినా 80 శాతం డబ్బు వెనక్కి!*

భారతీయ విమాన ప్రయాణికులకు ఇది నిజంగా ఒక ఊరటనిచ్చే అద్భుతమైన వార్త. సాధారణంగా రైలు ప్రయాణం మాదిరిగా విమాన ప్రయాణంలో టికెట్ రద్దు సౌకర్యం అంత సులభంగా ఉండదు. అత్యవసర పరిస్థితులు, అనారోగ్య కారణాలు లేదా వ్యక్తిగత పనుల వల్ల చివరి నిమిషంలో విమాన టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే, ప్రయాణికులు తమ టికెట్ డబ్బులో దాదాపు మొత్తం కోల్పోవాల్సి వచ్చేది. రీఫండ్ పేరుతో నామమాత్రపు మొత్తం చేతికి అందేది. కానీ, ఈ దుస్థితిని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం, విమానయాన సంస్థలు కలిసి ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టాయి.
రాబోయే రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న కొత్త రీఫండ్ మోడల్ ప్రకారం.. ప్రయాణికులు తమ టికెట్ ను రద్దు చేసుకుంటే, టికెట్ ధరలో ఏకంగా 80 శాతం వరకు రీఫండ్ పొందే అవకాశం లభించనుంది. ఇందుకోసం విమానయాన శాఖ కార్యదర్శి ఇప్పటికే పలు విమానయాన సంస్థలతో కీలక చర్చలు జరిపారు. ఈ కొత్త విధానం అమలుకు ప్రధాన ఆయుధం “ఇన్సూరెన్స్”. ప్రతి టికెట్ పై సుమారు 50 రూపాయల ప్రీమియంతో ఒక చిన్నపాటి బీమాను చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ బీమా ప్రీమియం భారాన్ని ప్రయాణికులపై మోపకుండా, విమానయాన సంస్థలే భరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే ప్రయాణికుడు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ రక్షణ కవచం వర్తిస్తుంది.
అయితే ఈ సౌకర్యాన్ని పొందడానికి ఒక నిబంధన ఉంది. విమాన ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే టికెట్ ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి మూడు గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే మాత్రం రీఫండ్ వర్తించదు. ఇది మినహాయించి, మిగిలిన సమయాల్లో అత్యవసర కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే, సదరు విమానయాన సంస్థే బీమా కంపెనీ నుండి క్లెయిమ్ చేసుకుని, ప్రయాణికుడికి 80 శాతం మొత్తాన్ని రీఫండ్ గా అందిస్తుంది. గతంలో ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్ ప్రయాణికులకు ఆప్షనల్ బీమాను అందించేవి. కానీ అవగాహన లేకనో, అదనపు ఖర్చు ఎందుకనో చాలామంది దీనిని ఎంచుకునేవారు కాదు. ఫలితంగా టికెట్ రద్దయినప్పుడు తీవ్రంగా నష్టపోయేవారు. దీనిపై డీజీసీఏకు వేలకొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్నిసార్లు రీఫండ్ ఇవ్వకుండా, భవిష్యత్తు ప్రయాణాలకు వాడుకునేలా “క్రెడిట్ షెల్” ఇస్తామని సంస్థలు చెప్పడం ప్రయాణికులకు మరింత చిరాకు తెప్పించేది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రభుత్వం ఈ “ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ మోడల్”ను తెరపైకి తెచ్చింది. ప్రయాణికుల భద్రత, ఆర్థిక వెసులుబాటు దృష్ట్యా విమానయాన సంస్థలే ఈ బాధ్యత తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ కొత్త రూల్స్ కనుక అమల్లోకి వస్తే విమాన ప్రయాణం సామాన్యుడికి మరింత చేరువవుతుందనడంలో సందేహం లేదు.