Mahaa Daily Exclusive

  అనిల్‌ అంబానీకి సుప్రీం ‘షాక్‌’…

Share

అనిల్‌ అంబానీకి సుప్రీం ‘షాక్‌’.
* మోసపూరిత ఖాతాలపై విచారణకు గ్రీన్ సిగ్నల్.
*రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ముంచుకొస్తున్న గండం.
*బ్యాంకులను ముంచిన ఖాతాలపై సీబీఐ పంజా?
*రుణ గ్రహీతలకు నోటీసులు ఇవ్వాల్సిందే.
* కానీ విచారణ ఆగదు… సుప్రీం కీలక తీర్పు.

ఢిల్లీ, మహా.

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చట్టపరమైన పోరాటంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ , దాని అనుబంధ సంస్థల బ్యాంకు ఖాతాలను ‘మోసపూరితమైనవి’ గా ప్రకటించి, తదుపరి చర్యలు తీసుకోవడానికి బాంబే హైకోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఆ వినతిని తోసిపుచ్చింది. దీంతో బ్యాంకులను వంచించి వేల కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగేందుకు మార్గం సుగమమైంది. అనిల్ అంబానీ వాదనలో పసలేదని తేల్చిచెప్పిన ధర్మాసనం, దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
ఈ వివాదం మూలాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌లో ఉన్నాయి. రుణాలు చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంస్థల ఖాతాలను బ్యాంకులు ‘ఫ్రాడ్’గా వర్గీకరించే అధికారాన్ని ఈ సర్క్యులర్ కల్పిస్తుంది. ఎస్‌బీఐ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్‌కామ్ ఖాతాలను మోసపూరితమైనవిగా గుర్తించాయి. దీనిపై అనిల్ అంబానీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించే ముందు రుణగ్రహీతకు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని కోర్టు సూచించింది. అయితే, అదే సమయంలో బ్యాంకులకు ఉన్న విచారణ అధికారాలను మాత్రం అడ్డుకోలేదు. హైకోర్టు ఇచ్చిన ఈ వెసులుబాటును సవాల్ చేస్తూ.. అసలు ఆ వర్గీకరణే చెల్లదన్నట్లుగా అనిల్ అంబానీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ, అత్యున్నత న్యాయస్థానం నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయనకు చట్టపరమైన రక్షణ కవచం లేకుండా పోయింది.
ఈ తీర్పుతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాల్లో జరిగిన భారీ నిధుల మళ్లింపుపై సీబీఐ లేదా ఈడీ వంటి సంస్థలు లోతైన దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న అనిల్ అంబానీకి, ఈ ‘ఫ్రాడ్’ ముద్ర మరింత తలనొప్పిగా మారింది. వేల కోట్ల ప్రజా ధనాన్ని మోసపూరితంగా వినియోగించారనే ముద్ర పడితే, అది ఆయన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ఇతర వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. న్యాయస్థానం తీర్పుతో ఇప్పుడు బంతి బ్యాంకులు మరియు దర్యాప్తు సంస్థల కోర్టులో ఉంది. పారిశ్రామిక దిగ్గజంగా ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీ, ఇప్పుడు కోర్టుల చుట్టూ, విచారణాధికారుల ముందు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని కార్పొరేట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది.

Latest