దక్షిణాది దెబ్బతినదు.
* విపక్షాల ప్రచారం అంతా అబద్ధం.
• ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు.
• డీలిమిటేషన్ బిల్లుతో పెరగనున్న ఎంపీల సంఖ్య.
• విపక్షాల కుట్రలను తిప్పికొట్టిన అమిత్ షా.
ఢిల్లీ, మహా.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బుధవారం లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు-2026పై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు కావాలనే విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, ఈ బిల్లు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను ఏకరీతిన 50 శాతం మేర పెంచబోతున్నామని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్ష పడుతుందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రతి రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను అలాగే కొనసాగిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పెరగబోయే సీట్ల వివరాలను అమిత్ షా గణంకాలతో సహా సభ ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాల సంఖ్య 38కి పెరుగుతుందని, అలాగే తెలంగాణలో 17 సీట్లు కాస్తా 26కి చేరుతాయని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతమున్న 39 స్థానాలు 59కి, కర్ణాటకలో 28 స్థానాలు 42కి పెరుగుతాయని వివరించారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల సంఖ్య 129 నుంచి 195కి పెరుగుతుందని, ఇది దక్షిణాది ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీట్లు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదని, అలాంటప్పుడు అన్యాయం ఎక్కడ జరుగుతుందో విపక్షాలే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బీజేపీ దక్షిణాదికి వ్యతిరేకమంటూ ముద్ర వేయాలని చూస్తున్న శక్తులకు ఈ గణాంకాలే సమాధానమని ఆయన మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో రాష్ట్రాల వాటా నిష్పత్తిని అమిత్ షా శాస్త్రీయంగా వివరించారు. ఉదాహరణకు, ప్రస్తుత 543 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.60 శాతంగా ఉంటే, సీట్ల పెంపు తర్వాత కూడా అదే 4.60 శాతం వాటా కొనసాగుతుందని చెప్పారు. అలాగే తెలంగాణ వాటా ప్రస్తుతం ఉన్న 3.30 శాతమే భవిష్యత్తులోనూ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం మేర సీట్లు పెంచడం వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రాముఖ్యతను కోల్పోదని, ఇది అత్యంత పారదర్శకమైన విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఉత్తర-దక్షిణ విభేదాలను సృష్టించడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన రాష్ట్రాలను తక్కువ చేయడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని మరింత విస్తృతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దేశంలోని ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అశాస్త్రీయ వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. 2026 నాటి ఈ చారిత్రక సంస్కరణ ద్వారా భారత పార్లమెంటరీ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతుందని, ప్రాంతీయ ఆకాంక్షలకు చట్టసభల్లో సముచిత స్థానం లభిస్తుందని అమిత్ షా తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు భరోసా కల్పించారు.








