Mahaa Daily Exclusive

  మీరట్ కేసులో విచిత్రం..!

Share

  • మీరట్ కేసులో విచిత్రం..!
  • భర్త పుట్టినరోజే.. మరో బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్.
  • జైలు గోడల మధ్య ‘బ్లూ డ్రమ్’ కేసు నిందితురాలు ముస్కాన్ ప్రసవం.. ఆడబిడ్డ జననం.
  •  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో కొత్త ట్విస్ట్.. జైల్లోనే తల్లైన ముస్కాన్ రస్తోగి.

హైదరాబాద్, మహా.

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కిరాతకమైన హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంటూ గత ఎనిమిది నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ముస్కాన్ రస్తోగి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ జననంలో ఒక ఆసక్తికరమైన యాధృచ్ఛికం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. హతుడైన ఆమె భర్త పుట్టినరోజు నాడే, ముస్కాన్ మరో బిడ్డకు జన్మనివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య ఉదంతం ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ముస్కాన్ రస్తోగి ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆదివారం రాత్రి ఆమెకు జైలులోనే తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో అప్రమత్తమైన జైలు అధికారులు హుటాహుటిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తేదీలు యాధృచ్ఛికంగా కలవడం. ముస్కాన్ చేతిలో హత్యకు గురైన ఆమె భర్త సౌరభ్ రాజ్‌పుత్ పుట్టినరోజు నవంబర్ 24 కాగా, సరిగ్గా అదే రోజున ముస్కాన్ తన రెండవ కుమార్తెకు జన్మనివ్వడం గమనార్హం. విధి ఆడిన వింత నాటకంలా.. తండ్రి జయంతి నాడే ఈ చిన్నారి భూమి మీదకు రావడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముస్కాన్ గత ఎనిమిది నెలలుగా తన ప్రియుడు సాహిల్‌తో కలిసి జైలు జీవితం గడుపుతోంది. పోలీసులు వీరిని అరెస్టు చేసిన సమయానికే ముస్కాన్ దాదాపు నెలన్నర గర్భవతిగా ఉన్నట్లు సమాచారం.
ముస్కాన్‌కు ఇదివరకే పిహు అనే మొదటి కుమార్తె ఉంది. తల్లి జైలు పాలవ్వడం, తండ్రి మరణించడంతో ఆ చిన్నారి ప్రస్తుతం సౌరభ్ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతోంది. ఇప్పుడు జన్మించిన రెండో పాప భవిష్యత్తు, సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. నేరపూరిత ఆలోచనలతో జీవితాలను నాశనం చేసుకున్న ఈ కేసులో, అమాయకమైన చిన్నారులు బాధితులుగా మిగిలిపోవడం విచారకరం.

Latest