- విస్తరిస్తున్న ఆర్ఎస్ఎస్
- సేవా కార్యక్రమాల్లో దూసుకుపతున్న సంఘ కార్యకర్తలు
- రాబోయే రోజుల్లో మరింత విస్తరణ
- ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్
హైదరాబాద్, మహా : హిందూ సంఘటనం దిశగా వ్యక్తి నిర్మాణం ఆధారంగా స్వయంసేవకులను తీర్చిదిద్దుతూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ అన్నారు. హర్యానాలోని సమాల్ఖాలో మార్చి 13 నుంచి 15 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాదులో మీడియా ప్రతినిధులకు వివరించారు. ఆర్ఎస్ఎస్‌ని స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన తరుణంలో సంఘ భావజాలం, సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు. 1925లో సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక రకాల సమస్యలు, అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చిందన్నారు.
2025–26 సంవత్సరం శతాబ్ది సంవత్సరం కావడంతో శతాబ్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పర్యటనల ప్రణాళిక రూపొందించామని, మొత్తం 22 ప్రాంతాలలో సంఘ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పర్యటనలు జరిగాయన్నారు. దేశంలోని నాలుగు మహానగరాలు – ఢిల్లీ, బెంగళూరు, కోల్ కత్తా, ముంబైలో “సంఘం 100 సంవత్సరాలు – కొత్త దిశలు” అనే అంశంపై ఉపన్యాస శ్రేణులు నిర్వహించామని, సమాజంలోని ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించడం జరిగిందన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, మొత్తం 55 దేశాలకు చెందిన విద్యా, పరిపాలన, పరిశ్రమ మరియు సామాజిక రంగాల ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారన్నారు. సంఘ్ 1925లో ప్రారంభమైనప్పటి నుంచీ అనేక రకాల సవాళ్ళు, అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 55,683 స్థలాల్లో ఆర్ఎస్ఎస్ దైనందిన శాఖలు 88,949 నడుస్తున్నాయి. గడచిన ఐదారేళ్ళుగా శాఖలు, పాల్గొంటున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోందని తెలిపారు. వీటితో పాటు 32,606 శాఖా మిలన్లు (వీక్లీ), 13,211 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయని, మొత్తంగా దైనందిన శాఖలు, మిలన్లు, మండలితో కలిపి 1,90,449 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో మొత్తం 2,112 స్థలాలలో 3,492 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 375 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 337, నెలవారీగా 69 శాఖలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అఖిలభారత స్థాయిలో పరిశీలిస్తే మొత్తం మండలాలు 59,004, శాఖాయుక్త 32,305, పూర్ణ: 2,620 కాగా తెలంగాణలో మండలాలు 1,616
శాఖాయుక్త 1,329, బస్తీలు 1504, శాఖాయుక్త 1244. ప్రస్తుతం సేవా కార్యక్రమాలను పరిశీలిస్తే
అఖిల భారతీయ స్థాయిలో 96045 జరుగుతుండగా, తెలంగాణలో 773 స్థలాలలో 1823 కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.







