Mahaa Daily Exclusive

  లద్ధాఖ్‌లో చైనా ప్రాజెక్టులపై అభ్యంతరం.

Share

• పాక్‌కు భారత్ మరోసారి స్పష్టీకరణ.

ఢిల్లీ, మహా.

జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు భారత భూభాగంలో భాగమేనని, అక్కడ చైనా చేపడుతున్న ఏకపక్ష చర్యలు భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొన్నప్పుడే భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొంది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల మనీలాలో జరిగిన ఆసియాన్ సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశానికి సంబంధించి చైనా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తైవాన్, టిబెట్ అంశాలపై చైనా విడుదల చేసిన ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. 1963 నుంచి భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను చైనా అక్రమంగా ఆక్రమించి, అక్కడ ప్రాజెక్టులు చేపడుతోందని ఆరోపించారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తున్న చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ), షక్స్‌గామ్ లోయలో చైనా కార్యకలాపాలపై భారత్ ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు. సరిహద్దు వివాదాల పరిష్కారం, శాంతియుత వాతావరణం ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి కీలకమని పునరుద్ఘాటించారు.

సింధు జలాల ఒప్పందంపై కూడా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదానికి శాశ్వత, విశ్వసనీయ ముగింపు పలికే వరకు సింధు జలాల ఒప్పందం అమల్లోకి రాదని రణధీర్ జైస్వాల్ తెలిపారు. చీనాబ్ నదిలో వరదలను భారత్ కావాలనే సృష్టించిందన్న పాకిస్థాన్ ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. జమ్మూ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్లే నీటి ప్రవాహం పెరిగిందని, అవసరమైతే మానవతా దృక్పథంతో వరదల సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా పాకిస్థాన్‌తో పంచుకుంటామని వెల్లడించారు.