Mahaa Daily Exclusive

  కేంద్రంలో మంత్రివర్గ మార్పుల ఊహాగానాలు.

Share

  • ధర్మేంద్ర రాజీనామా తర్వాత ఢిల్లీలో కదలికలు.

ఢిల్లీ, మహా.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలను ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో కేంద్రంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోనూ రాజకీయ మార్పులు సంభవించే అవకాశం ఉందని, ఫడణవీస్‌కు కేంద్రంలో బాధ్యతలు అప్పగించే అవకాశముందని వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా 12 శాఖల కార్యదర్శులను బదిలీ చేసింది. వీరిలో విద్యాశాఖ కార్యదర్శి కూడా ఉండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.