- ప్రభుత్వానికి బిగ్ షాక్
- వెలుగుమట్ల భూదాన్ భూములపై హై కోర్టు స్టేటస్ కో
- ఇళ్ళు కోల్పోయిన అందరికీ ఇళ్ళు ఇవ్వాలని ఆదేశం
- బాధితులకు భారీ ఊరట
హైదరాబాద్, మహా : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్‌లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కాగా, ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో గతంలోనే హైకోర్టు ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) ఉత్తర్వులు ఉన్నప్పటికీ, అధికారులు ఫిబ్రవరిలో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. సుమారు 31 ఎకరాల భూమిలో ఇళ్ల కూల్చివేతలు జరగగా, కోర్టు ఆదేశాలు పొందిన పది కుటుంబాలకు మినహాయింపునిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్ల గ్రామం, వినోబా నవోదయ కాలనీ. 2014లో 800లకు పైగా పేద కుటుంబాలకు కేటాయించిన భూదాన్ భూములను ప్రభుత్వం అక్రమంగా భావించి, ఫిబ్రవరి 2026లో కూల్చివేతలు చేపట్టింది గతంలోనే ఇక్కడ ఇళ్ల కూల్చివేతలపై స్టేటస్ కో ఉన్నా, ప్రభుత్వం ఆక్రమణల పేరుతో చర్యలు చేపట్టింది. 31.07 ఎకరాల భూదాన్ భూమిలో సుమారు 21 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని, గురుకుల పాఠశాల, కేజీబీవీల కోసం ఈ భూమిని తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గతంలో ఉన్న ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి)ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.







