Mahaa Daily Exclusive

  ఏపీ సర్కార్‌ పై మంత్రి జూపల్లి ధ్వజం..! గాంధీ భ‌వ‌న్ లో మంత్రి జూప‌ల్లి ప్రెస్ మీట్..

Share

  • ఏపీ సర్కార్‌ పై మంత్రి జూపల్లి ధ్వజం
  • నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి
  • తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • గాంధీ భ‌వ‌న్ లో మంత్రి జూప‌ల్లి ప్రెస్ మీట్

హైదరాబాద్‌, మహా : శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తూ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు డా. చిక్కుడు వంశీకృష్ణ, డా. రాజేష్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ట నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు) కు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేపట్టకూడదనే స్పష్టమైన నిబంధనలున్నాయని జూపల్లి గుర్తు చేశారు. ఈ నిబంధనలను తుంగలో తొక్కి, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అన్యాయంగా నీటిని తోడేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ ప్రభుత్వం తన మొండివైఖరిని వీడలేదు అని ఆయన ధ్వజమెత్తారు.

 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులమంతా ఏకమై శ్రీశైలం వద్ద ‘వంటా-వార్పు’ కార్యక్రమానికి పిలుపునిచ్చామని, మా హెచ్చరికల తీవ్రతను గమనించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని జూపల్లి పునరుద్ఘాటించారు. పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగితే రైతు పక్షాన నిలబడి ప్రభుత్వం పోరాడుతుంది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి వాటాల అంశంలో తెలంగాణ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు గతంలోనూ తాము ఆందోళనలు చేశామని, హైకోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తుచేశారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ‌ని, నీటి కేటాయింపుల విషయంలో ఎవరితోనూ రాజీపడబోమ‌న్నారు.