Mahaa Daily Exclusive

  ఇండీ కూటమి పిటిషన్​లో 14 లోపాలు…

Share

  • ఇండీ కూటమి పిటిషన్​లో 14 లోపాలు
  • సవరిస్తే విచారిస్తామన్న సుప్రీంకోర్టు
  • కోర్టు రుసుము చెల్లింపు కూడా వ్యత్యాసమన్న కోర్టు
  • పిటిషనర్ల అనుమతి పత్రాలు తప్పనిసరి వెల్లడి

న్యూఢిల్లీ, మహా : ఎస్ఐఆర్ లో పెద్దఎత్తున ఓట్ల తొలగింపు సహా అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు 10 మంది ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. ఈ పిటిషన్‌లో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ గుర్తించిన లోపాలను పిటిషనర్లు ఇంకా సవరించకపోవడమే కారణంగా తేలింది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఈ పిటిషన్‌లో రిజిస్ట్రీ మొత్తం 14 లోపాలను గుర్తించింది. కోర్టుకు చెల్లించాల్సిన రుసుములో 220 రూపాయలు తక్కువ పడటం కూడా వాటిలో ఒకటని తెలిపింది. మిగిలిన లోపాల్లో తొమ్మిది మంది పిటిషనర్ల అధికారిక అనుమతి పత్రాలు లేవని, కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే గుర్తింపు కార్డు నకలులో ఆయన ఫొటో ఐడీ స్పష్టంగా లేదని వివరించింది. పిటిషన్‌లో పొందుపరిచిన కొన్ని పత్రాలు చదవడానికి వీలు లేకుండా ఉన్నాయని పేర్కొంది. పేజీల నంబరింగ్ క్రమంలో వ్యత్యాసాలు వంటి లోపాలున్నాయని, వాటిని సవరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. మంగళవారం ఈ వ్యవహారాన్ని ఒక జర్నలిస్ట్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించగా, సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు భరోసా ఇచ్చింది. లోపాలను సరిదిద్దినట్లయితే వారి అంశాలను విచారణ కోసం జాబితా చేస్తామని తెలిపింది. “మేము ఈ పిటిషన్లన్నింటినీ విచారణకు జాబితా చేస్తాము. అయితే ముందుగా అందులోని లోపాలన్నీ సవరించేలా చూసుకోండి.” అని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఖర్గేతో పాటు టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐకు చెందిన డి. రాజా, ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ మహువా మాఝీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, ముస్లిం లీగ్ నేత ఇ.టి. మహమ్మద్ బషీర్ తదితరులు సహ పిటిషనర్లుగా ఉన్నారు. ఈ కేసులో భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు.

ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపులు, అక్రమాలు జరిగాయని ఈ పిటిషన్​లో ఆరోపించారు. ఎస్ఐఆర్ సమయంలో జరిగిన తొలగింపులు, మార్పులపై నిర్ణీత కాలపరిమితిలో స్వతంత్ర ఆడిట్ నిర్వహించేందుకు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. చట్టప్రకారం తగిన నోటీసు, విచారణకు సహేతుకమైన అవకాశం లేకుండా ఏ ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, అలాగే ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో అర్హులైన వ్యక్తులు చట్టం అనుమతించిన చివరి తేదీ వరకు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇది కోరింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం వ్యవహారాలు, పలువురు విద్యార్థుల ఏకపక్ష అరెస్టులు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ, ఖర్గే కోరగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. అయితే, దీనిపై న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేస్తే త్వరితగతిన విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. దీంతో ఇండీ కూటమి సుప్రీం కోర్టుకు భారీ ర్యాలీ చేపట్టి పిటిషన్ దాఖలు చేసింది.