చైనా కంటే మన ఆర్థిక వృద్ధి మెరుగు.
* బ్లూమ్‌బర్గ్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ.
న్యూఢిల్లీ, మహా.
భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు చైనా కంటే మెరుగ్గా ఉందని, ప్రస్తుతం మన వృద్ధి రేటు 7 శాతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తు పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని, దేశంలోని డిజిటల్ నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చే గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.
సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు నేటి కాలంలో అత్యంత శక్తివంతమైన వనరులని ప్రధాని పేర్కొన్నారు. అయితే, అధికారం ఎవరి చేతిలో ఉందనేది ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనం కోసం, వారి సాధికారత కోసం ఆ శక్తిని ఎలా వినియోగిస్తున్నారనేదే అసలైన ప్రశ్న అని ఆయన నొక్కిచెప్పారు. సాంకేతిక ప్రయోజనాలు కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకుండా కోట్లాది మందికి నూతన అవకాశాలు సృష్టించేలా ఉండాలన్నారు. నియంత్రణ కంటే సాధికారతకు, పోటీ కంటే సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తొలిసారిగా బ్లూమ్‌బర్గ్ ఫోరమ్‌ను భారత్‌లో నిర్వహించడాన్ని స్వాగతించిన మోదీ.. సరైన సమయంలో, సరైన ప్రదేశాన్ని ఎంచుకున్నారంటూ మైఖేల్ బ్లూమ్‌బర్గ్‌ను అభినందించారు.
భారత్‌ను ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. దేశంలోని భాషా వైవిధ్యం, మీడియా స్వేచ్ఛ, పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగదారులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసమే తాము ఎదుగుతామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వృద్ధిలో డిజిటల్ శక్తి అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. దేశంలో ఒక సాధారణ వీధి వ్యాపారి నుంచి బడా కారు షోరూమ్ యజమాని వరకు వేర్వేరు స్థాయిల్లో ఉన్నప్పటికీ.. ఇద్దరూ ఒకే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను వినియోగిస్తున్నారని, ఇదే సమ్మిళిత సాంకేతిక శక్తికి అసలైన ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చిన అతిథులు సైతం భారత్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను స్వయంగా ఉపయోగించి చూడాలని ప్రధాని సూచించారు.






