2029లో రాహుల్ ఘోర పరాజయం ఖాయం.
* ఈవీఎంలపై నిందలెందుకు?
* ఎన్నికల ఓటములకు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
* అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.
న్యూఢిల్లీ, మహా.
ఎన్నికల్లో ఎదురయ్యే వరుస పరాజయాలను ఈవీఎంలకు, ఓటర్ల జాబితా సవరణలకు ఆపాదించడం మానుకోవాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హితవు పలికారు. ఇదే వైఖరి కొనసాగితే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఆత్మపరిశీలన చేసుకోకుండా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలను నిందించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని తీవ్రంగా దుయ్యబట్టారు. గుజరాత్‌లోని గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వాదనల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను హోంమంత్రి కొట్టిపారేశారు. ఈ సవరణ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైందని, అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆ పార్టీకి వరుస ఓటములు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఓటర్ల జాబితా సవరణను సాకుగా చూపడం తగదన్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ఇటీవల రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను, త్రిపుర గిరిజన ప్రాంతాల గ్రామ కమిటీ ఎన్నికల్లో భాజపా కూటమి కనబరిచిన జోరును అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ, నిరాధార ఆరోపణలతో కాలం గడపడం మానుకోవాలని స్పష్టం చేశారు.







