Mahaa Daily Exclusive

  ఢిల్లీకి మూటలు పంపే టెన్షన్లో నిజాలు మర్చిపోయారా..? నిప్పులు చెరిగిన బండి సంజయ్..!

Share

  •  దక్షిణ భారతంపై అబద్ధాల వేట.. సీఎంకు కేంద్ర మంత్రి 20 ప్రశ్నలు.
  •   అంబేద్కర్‌ సాక్షిగా మోసం.. కాంగ్రెస్ డీఎన్ఏలోనే విభజన.
  • నిప్పులు చెరిగిన బండి సంజయ్!

హైదరాబాద్ , మహా.

రాష్ట్ర రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది అస్తిత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ప్రజల్లో భయాందోళనలు సృష్టించి దేశాన్ని విభజించాలనే కుట్ర దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం మీడియా ముఖంగా సీఎంకు సంధించిన ‘స్క్రోలింగ్ పాయింట్స్’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేమిటో నిరూపించాలని ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా లేక హైకమాండ్ కు ‘మూటలు’ అప్పగించే వ్యాపారవేత్తలా మాట్లాడుతున్నారా అంటూ బండి సంజయ్ చేసిన విమర్శలు పదునైన తూటాల్లా పేలుతున్నాయి.

**డబ్బుకు.. ఓటుకు లింకా? ఏదీ మీ శాస్త్రీయత?**

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ఆర్థిక సూత్రంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. డబ్బు సమకూర్చే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం అంటే.. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. “లక్ష కోట్లు ఉన్న మీ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలా? డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు ఉండకూడదా?” అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు రేవంత్ రెడ్డి వాదనలోని లొసుగులను ఎండగట్టాయి. రేవంత్ రెడ్డి చెప్పే హైబ్రీడ్ మోడల్ అంటే.. కాంగ్రెస్ పార్టీలాగే దోచుకునే వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడమా అని ఆయన ఎద్దేవా చేశారు. ముంబై, ఢిల్లీలకు మాత్రమే సీట్లు పెంచి, వెనుకబడిన ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలను విస్మరించాలన్నదే సీఎం ఉద్దేశమా అని ఆయన నిలదీశారు.

**అంబేద్కర్‌ సిద్ధాంతాలను చంపేస్తారా?**

రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్న తరుణంలో, పుట్టిన రోజే ఆయన సిద్ధాంతాలను చంపేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారా అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి, డీలిమిటేషన్ గురించి ఏం రాశారో చదివే స్థితిలో కూడా ముఖ్యమంత్రి లేరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని బతికినంత కాలం అవమానించిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి మనీ తప్ప మనిషితో సంబంధం లేదని, మనీ (ర) మనిషిగా మారిన రేవంత్ రెడ్డి.. కనీసం మనిషిగా ఆలోచించే తత్వాన్ని కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు.

**కేసీఆర్ నీడలో రేవంత్.. పచ్చి అబద్ధాల వేట!**

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన కేసీఆర్ నీడ నుంచి బయటకు రావడం లేదని స్పష్టమవుతోందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లాగే అడ్డగోలు హామీలు ఇవ్వడం, పచ్చి బూతులు మాట్లాడటం, ప్రశ్నించే వాళ్లను సమాధి చేయాలని చూడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించారని, ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను పార్లమెంట్ లో చింపి పారేసిన పార్టీలతో అంటకాగుతున్న కాంగ్రెస్, ఇప్పుడు మహిళా రిజర్వేషన్లపై మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. కాసేపట్లో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లోనైనా రేవంత్ రెడ్డి నిజం మాట్లాడాలని, దక్షిణాది ప్రజలకు జరిగే నష్టమేమిటో ఆధారాలతో సహా నిరూపించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Latest