- మహిళా రిజర్వేషన్లు కేవలం ‘నెపం’.
- అసలు గురి ‘సీమాంకనం’పైనే.
- దక్షిణాది అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ‘ఖతర్నాక్’ ప్లాన్.. కేంద్రంపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ,మహా.
దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు ఒక మహా సంగ్రామానికి దారితీస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది గొంతుకగా నిలవగా, ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగి మోదీ సర్కార్‌పై అస్త్రశస్త్రాలను సంధించారు. కేంద్రం తలపెట్టిన సీమాంకన ప్రక్రియ కేవలం జనాభా లెక్కల సర్దుబాటు కాదని, ఇది సాక్షాత్తూ ‘రాజ్యాంగంపై జరుగుతున్న దాడి’ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన విశ్లేషణాత్మక కథనంలో, కేంద్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా అమలు చేస్తున్న ఈ ‘ఖతర్నాక్’ ప్లాన్ వెనుక ఉన్న అసలు రంగును ఆమె బట్టబయలు చేశారు. ఈ నెల 16 నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్లు కాదని, సీమాంకనం పేరిట దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర అని ఆమె ఆరోపించారు.
**మహిళా రిజర్వేషన్లు ఒక ‘కవచం’ మాత్రమే!**
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం చూపుతున్న ఉత్సాహం కేవలం ఒక ‘ఐ వాష్’ (కంటితుడుపు) మాత్రమేనని సోనియా విశ్లేషించారు. అసలు రిజర్వేషన్ల అమలును 2029 వరకు సాగదీయడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆమె ప్రశ్నించారు. కేవలం మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని, సీమాంకన ప్రక్రియకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కేంద్రం ‘బుల్డోజర్’ తరహాలో ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి పెట్టు అని, అప్రజాస్వామిక పద్ధతుల్లో దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ కొత్త నాటకానికి తెరలేపిందని సోనియా విమర్శించారు.
**దక్షిణాదికి జరిగే అన్యాయంపై ఆందోళన**
సీమాంకనం జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఘోరంగా పడిపోతుందన్న ఆందోళనను సోనియా గాంధీ గట్టిగా వినిపించారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసి, అక్షరాస్యతలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్షగా మారబోతోందని ఆమె హెచ్చరించారు. కేవలం అంకెలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని, రాజకీయ సమానత్వం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేశారు. జనాభాను నియంత్రించని రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కట్టబెట్టి, ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలను రాజకీయంగా అప్రస్తుతం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు.
**ఎన్నికల కోసమే ‘నరేటివ్ మేనేజ్‌మెంట్’!**
త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఈ విన్యాసాలు చేస్తున్నారని సోనియా ఆరోపించారు. దేశంలో నెలకొన్న అసలైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ‘నరేటివ్ మేనేజ్‌మెంట్’ (వార్తా విన్యాసం) చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలను రక్షణ స్థితిలోకి నెట్టేందుకు రాజ్యాంగంతో చెలగాటమాడుతున్నారని, దీనిని దేశం హర్షించదని ఆమె తేల్చి చెప్పారు.








