Mahaa Daily Exclusive

  ధరణి చీకట్ల నుంచి భూభారతి వెలుగుల్లోకి.. పాస్‌బుక్కుల పంపిణీతో మంత్రి పొంగులేటి..

Share

  •  భూ పరిపాలనలో సరికొత్త విప్లవం.
  •  గొలుసుల కాలం చెల్లింది.. రోవర్ల శకం మొదలైంది.
  •  ప్రతి గజానికి ‘భూధార్‌’ రక్షణ కవచం.
  •  పాస్‌బుక్కుల పంపిణీతో మంత్రి పొంగులేటి.

హైదరాబాద్, మహా.

ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సామాన్య రైతుకు భూమిపై పూర్తి హక్కు కల్పించేలా భూభారతి చట్టాన్ని ఒక బలమైన ఆయుధంగా తీర్చిదిద్దామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.సోమవారం నాడు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం వారు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, పారదర్శకత, జవాబుదారీతనమే ఊపిరిగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దినట్లు మంత్రి ప్రకటించారు.

భూభారతి పోర్టల్ ప్రారంభమైన ఈ 12 నెలల కాలంలో సాధించిన గణాంకాలు చూస్తుంటే, ప్రజలకు ఈ వ్యవస్థపై ఎంతటి విశ్వాసం పెరిగిందో స్పష్టమవుతోందన్నారు .కేవలం ఒకే ఏడాదిలో 5.20 కోట్లకు పైగా ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించగా, సుమారు 70 లక్షల మంది వినియోగదారులు నేరుగా లాగిన్ అయ్యి తమ భూ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేశారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొన్న పట్టాదారు పాస్‌బుక్కుల ఇబ్బందులను అధిగమిస్తూ, ఈ స్వల్ప కాలంలోనే 3.80 లక్షల మందికి కొత్త పాస్‌బుక్కులను జారీ చేయడం ఒక రికార్డుగా నిలిచిందన్నారు. పాత కాలం నాటి ఆర్వోఆర్-2020 చట్టం వల్ల ఏర్పడిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ, రెవెన్యూ యంత్రాంగాన్ని సామాన్యుడికి చేరువ చేయడంలో భూభారతి ఒక తిరుగులేని ఆయుధంగా రూపాంతరం చెందిందని స్పష్టం చేశారు..సాంకేతికత వినియోగంలోనూ ఈ చట్టం దేశానికే దిక్సూచిగా మారింది. నిజాం కాలం నాటి పాత గొలుసులు, కర్రలు, టేపులతో చేసే సర్వే పద్ధతులకు స్వస్తి పలికి, అత్యాధునిక రోవర్ల ద్వారా శాస్త్రీయంగా సర్వే నిర్వహించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని వివరించారు. ఇప్పటికే 411 రోవర్లను వినియోగిస్తుండగా, మరో 400 యంత్రాలను త్వరలోనే రంగంలోకి దించ బోతున్నామన్నారు . మనిషికి ఆధార్ కార్డు ఎలాగో, భూమికి భూధార్’నెంబర్‌ను కేటాయించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం సంకల్పించింది. 1948 నాటి 40 లక్షల సర్వే నెంబర్లు నేడు 2.29 కోట్లకు పెరిగిన తరుణంలో, ప్రతి నెంబరుకు ఒక విశిష్ట గుర్తింపునివ్వడం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలకు అడ్డుకట్ట పడనుందన్నారు.

కేవలం సర్వేకే పరిమితం కాకుండా, రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే తాటిపైకి తెస్తూ రూపొందించిన ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్’ పారదర్శకతకు నిలువుటద్దంగా నిలిచిందన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థను ఇప్పటికే ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. నిజాం కాలం నుంచి నక్షాలే లేని 378 గ్రామాల్లో రీ-సర్వే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, అందులో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో భూధార్ నెంబర్ల కేటాయింపు పూర్తి చేసినట్లు వివరించారు. 5,520 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లతో కూడిన భారీ దళాన్ని సిద్ధం చేయడం ద్వారా, తెలంగాణలో ఇకపై భూ సమస్యలు అనే మాటే వినపడకుండా చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Latest