- టీసీఎస్ ఆఫీసులో పోలీసుల ‘హై-వోల్టేజ్’ కోవర్ట్ ఆపరేషన్!
- నాసిక్ బ్రాంచ్‌లో ‘ఉద్యోగినుల’ వేషంలో మహిళా పోలీసులు.
- ’40 రోజులు ఉండి మరీ పట్టేసిన బాగోతం.
- లైంగిక వేధింపులు, మత మార్పిడిల ఒత్తిడి?
- టెక్కీల వేధింపుల వెనుక విస్తుపోయే నిజాలు బట్టబయలు.
- ఏడుగురు ఉద్యోగుల తొలగింపు.
సిట్ రంగ ప్రవేశంతో వణుకుతున్న అక్రమార్కులు.
నాసిక్,మహా.
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయం ఇప్పుడు ఒక భీతిగొల్పే క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎంతో గౌరవప్రదమైన సంస్థగా పేరున్న ఐటీ సామ్రాజ్యంలో, తెర వెనుక సాగుతున్న ఉద్యోగినుల వేధింపుల పర్వం ఇప్పుడు బట్టబయలైంది. కేవలం ఫిర్యాదులు తీసుకోవడమే కాకుండా, పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి నిర్వహించిన **’కోవర్ట్ ఆపరేషన్’** ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ నేతృత్వంలో ఆరుగురు మహిళా పోలీసులు ఉద్యోగినుల వేషంలో దాదాపు 40 రోజుల పాటు సదరు కార్యాలయంలోనే మకాం వేసి, అక్కడ సాగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు నిర్ధారించడం సంచలనం సృష్టిస్తోంది.
**ఉద్యోగినుల వేషంలో ఖాకీలు.. 40 రోజుల నిఘా!**
ఫిబ్రవరి మధ్య కాలం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ కోవర్ట్ ఆపరేషన్ సాగింది. నాసిక్ సిటీ పోలీసులకు చెందిన ఆరుగురు మహిళా అధికారులు, సామాన్య ఉద్యోగినుల వలె కార్యాలయానికి వెళ్తూ అక్కడి పరిస్థితులను గమనించారు. బాధితులు ఎదుర్కొంటున్న వేధింపులను, ఉన్నతాధికారుల మితిమీరిన ప్రవర్తనను రికార్డ్ చేశారు. ఈ ఆపరేషన్ ఫలితంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్య ఏకంగా 8 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఒక మహిళా ఉద్యోగిని తన సీనియర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చేసిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభం కాగా, లోతుగా తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
**మతం మార్పులు.. గొడ్డు మాంసం బలవంతం?**
ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాలేదు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, సదరు కార్యాలయంలోని కొంతమంది సీనియర్ ఉద్యోగులు మహిళా సిబ్బందిపై మతపరమైన ఒత్తిళ్లు కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బాధితులను బలవంతంగా నమాజ్ చేయించడం, గొడ్డు మాంసం తినమని వేధించడం, చివరకు మతం మార్చుకోవాలని బెదిరించడం వంటి అత్యంత వివాదాస్పద అంశాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఒక ‘రాకెట్’ తరహాలో ఈ దందా సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
**కంపెనీ యాక్షన్.. సిట్ విచారణ**
ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో టీసీఎస్ యాజమాన్యం రంగంలోకి దిగింది. నిందితులుగా తేలిన ఎనిమిది మందిలో ఏడుగురిని తక్షణమే విధుల్లోంచి తొలగించింది వేధింపుల పట్ల తమకు ‘జీరో టాలరెన్స్’ విధానం ఉందని, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మహిళల భద్రత కోసం అంతర్గత కమిటీలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో వేధింపులు జరగడం చూస్తుంటే ఐటీ కంపెనీల్లోని భద్రతా వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ నాసిక్ ఉదంతం ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.








