Mahaa Daily Exclusive

  ప్రజా వ్యతిరేక పాలనకు స్వస్తి పలకాలి..! పార్టీ శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు దిశానిర్దేశం..

Share

  • ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు.
  •  నిర్మల్‌లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్’ శిక్షణా తరగతులు.
  •  పార్టీ శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు దిశానిర్దేశం.

 

నిర్మల్, మహా.

సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి సైతం అభివృద్ధి ఫలాలు అందాలన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’, ‘ఏకాత్మ మానవతావాదం’ స్ఫూర్తితో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు పిలుపునిచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్’ శిక్షణా తరగతుల్లో భాగంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ముఖ్య నేతలు ప్రసంగించారు. అంకితభావం, క్రమశిక్షణతో పార్టీ సిద్ధాంతాలను గడపగడపకూ తీసుకెళ్తున్న కార్యకర్తలే బీజేపీకి అసలైన వెన్నెముక అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక, ప్రజానుకూల విధానాలే నేటి ‘నవ భారత’ నిర్మాణానికి మూలస్తంభాలని, ఈ దార్శనికతను మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై విశ్లేషిస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనతో తెలంగాణ ప్రజానీకం పూర్తిగా విసిగిపోయారని నేతలు విమర్శించారు. ఆయా పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ, రాష్ట్రానికి సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు ఎంతో ఆశగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం ద్వారానే తెలంగాణలో మార్పు సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలు మరింత సమన్వయంతో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు కోరారు.

Latest