- అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన , ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా మారిన అటవీ శాఖ అనుమతులు , ఇతర పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి సీతక్క నేతృత్వంలోని గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రిని కలిసి ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై సమర్పించిన వినతిపత్రానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు ,సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెక్ డ్యాంల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని హామీ ఇచ్చారు. ఈ చెక్ డ్యాంల ద్వారా అటవీ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు అందించడంతో పాటు స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను కూడా తీర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల నిలిచిపోయిన రహదారుల నిర్మాణం మరియు మరమ్మత్తుల అంశంపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. చెక్ డ్యాంలు మరియు రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వీలైనంత త్వరగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేల బృందానికి హామీ ఇచ్చారు.
రహదారుల మరమ్మత్తులు ఆలస్యం కావడం వల్ల మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు అందడం లేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులకు అనుమతులు నిరాకరిస్తున్నారని వారు వివరించగా, ఇటువంటి అంశాలపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. దీనితో పాటు, ఆదివాసీ మరియు గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇది గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అట్టడుగు వర్గాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంచే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాల పరిపాలనా కేంద్రాలైన ఐటీడీఏలను మరింత బలోపేతం చేసి, ఆదివాసీలకు మరియు గిరిజనులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.








