Mahaa Daily Exclusive

  దక్షిణ రాజకీయాల్లో ‘చెక్ అండ్ మేట్’: మోదీ-సిద్ధరామయ్య భేటీ వెనుక ప్రోటోకాల్ మర్యాదా.. పొలిటికల్ మతలబా?

Share

  • ప్రోటోకాల్ మర్యాద.. పొలిటికల్ మతలబు.
  • హస్తం’లో అసమ్మతి సెగలు.. ‘కమలం’ నిశిత పావులు.
  •  ఆధ్యాత్మిక అడుగు.. రాజకీయ మలుపు.
  • మఠాల సాక్షిగా ‘మహా’ వ్యూహం.

**హైదరాబాద్, మహా.**

ప్రస్తుత రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అందవు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు కుంభకోణాల ఆరోపణలు, ఇంకోవైపు కుర్చీలాట.. ఈ మూడింటి కలయికగా దక్షిణ భారతం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. ప్రధానంగా బెంగళూరు విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యంత సన్నిహితంగా, ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకుంటున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాకుండా, అనేక రాజకీయ విశ్లేషణలకు తావిస్తోంది. వీరిద్దరి మధ్య నవ్వుల వెనుక ‘నమ్మకం’ ఉందా లేక ‘రాజకీయ చదరంగం’ ఉందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
** సమాఖ్య మర్యాదా? రాజకీయ వ్యూహమా?**
విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సిద్ధరామయ్య స్వాగతం పలికిన దృశ్యం పైన చూడటానికి ప్రోటోకాల్‌లా ఉన్నా, లోపల మాత్రం లోతైన అర్థాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో కేంద్రంపై పోరాడుతున్న తరుణంలో, ప్రధాని మోదీ సిద్ధరామయ్యతో ఏకాంతంగా చర్చించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం ఒత్తిడి తెస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం. సిద్ధరామయ్య తన కుర్చీని కాపాడుకునేందుకు, డీకే శివకుమార్ వర్గాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం సాయం కోరుతున్నారా? లేక ప్రధాని మోదీ కన్నడ గడ్డపై కాంగ్రెస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని తనదైన శైలిలో పావులు కదుపుతున్నారా? అన్నది చర్చనీయాంశం.
**కాంగ్రెస్ ‘అంతర్గత’ పోరు.. ఢిల్లీ చేరిన సెగలు**
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. 30 మంది ఎమ్మెల్యేలు మంత్రులపై అసంతృప్తితో ఢిల్లీలో తిష్ట వేయడం, నాయకత్వ మార్పు డిమాండ్లు వినిపించడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తన వర్గాన్ని అప్రమత్తం చేయడం, చివరి నిమిషంలో కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనను రద్దు చేయించడం చూస్తుంటే.. కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎవరికి లాభిస్తుందోనని హైకమాండ్ తల పట్టుకుంటోంది.
**ఆదిచుంచనగిరి వేదికగా ‘వొక్కలిగ’ సమీకరణం**
మాండ్యా జిల్లాలోని ఆదిచుంచనగిరి మఠాన్ని ప్రధాని మోదీ సందర్శించడం వెనుక స్పష్టమైన సామాజిక లెక్క ఉంది. కర్ణాటక రాజకీయాలను శాసించే వొక్కలిగ సామాజిక వర్గానికి ఈ మఠం అత్యంత పవిత్రమైనది. జేడీఎస్ అధినేత దేవెగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామిలతో కలిసి మోదీ వేదికను పంచుకోవడం ద్వారా.. భాజపా-జేడీఎస్ కూటమి వొక్కలిగ ఓటు బ్యాంకుపై పట్టు సాధించే ప్రయత్నం చేసింది. ఆధ్యాత్మిక ముసుగులో సాగిన ఈ పర్యటన పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ప్రధాని మోదీ తన పర్యటన ద్వారా అటు ఆధ్యాత్మిక సందేశాన్నిస్తూనే ఇటు రాజకీయంగా ‘వొక్కలిగ’లను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ తన సొంత ఎమ్మెల్యేల అసమ్మతితో సతమతమవుతుంటే, ప్రత్యర్థి పార్టీలు కుంభకోణాల ఫిర్యాదులతో వారిని డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నాయి. సిద్ధరామయ్య-మోదీ రహస్య మంతనాలు కేవలం మర్యాదపూర్వకమేనా లేక ఏదైనా ‘పొలిటికల్ రీ-అలైన్‌మెంట్’ కు సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం దక్షిణ భారత రాజకీయాల్లో ‘చెక్ అండ్ మేట్’ గేమ్ నడుస్తోంది!