Mahaa Daily Exclusive

  కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం…..

Share

*అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పేర్లు మార్చారు.
*కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అడ్డుకునేందుకే హరీశ్‌రావు ఢిల్లీ టూర్.
* మేడిగడ్డపై అధికారులతో సమీక్ష అనంతరం సీఎం సంచలన వ్యాఖ్యలు.
* ఎన్డీఎస్ఏ అనుమతులతోనే ఇకపై పనులు జరగాలని అధికారులకు ఆదేశం.

కాళేశ్వరం,మహా.
వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, తదనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల భవితవ్యంపై కాళేశ్వరంలోని ఎల్ అండ్ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, బ్యారేజీల లోపాలు, పరిష్కార మార్గాలపై ఒక స్పష్టత వచ్చిందని తెలిపారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని పేర్కొన్న సీఎం.. ఇకపై ప్రాజెక్టు వద్ద జరిగే ప్రతి పనీ కచ్చితంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలని, ప్రతి చర్యకు వారి ముందస్తు అనుమతి తప్పనిసరని అధికారులను కఠినంగా ఆదేశించారు.
సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాత ప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే తనకు ఎలాంటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దక్కవనే దురుద్దేశ్యంతోనే, నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పేరు మార్చారని, అలాగే అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి భారీ అవినీతికి తెరతీశారని ఆరోపించారు. కేవలం రూ. 34 వేల కోట్ల అంచనాతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును ఏకంగా రూ. 1.50 లక్షల కోట్లకు పెంచేశారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో తీవ్ర లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజినీర్లు రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ, నాటి ముఖ్యమంత్రి కానీ, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కానీ ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 2023 అక్టోబర్‌లో బ్యారేజీ కుప్పకూలిపోయినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారని, కానీ ప్రకృతి సహకరించకపోవడంతో అది పూర్తిగా కుంగిపోయి ప్రపంచానికి అసలు నిజం తెలిసిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
**సీబీఐ విచారణకు భయపడే హరీశ్ రావు ఢిల్లీ టూర్..**
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణలో కదలిక వచ్చిందని, అందుకే దాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని సీఎం ఆరోపించారు. సీబీఐ విచారణ వేగవంతం అవుతోందన్న భయంతోనే మాజీ మంత్రి హరీశ్‌రావు హడావుడిగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, సీబీఐ ఇప్పటికీ విచారణ ప్రారంభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలో 48 గంటల్లోనే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్‌పై కోర్టులో తీర్పు ఇప్పటికే రిజర్వ్ అయిన నేపథ్యంలో, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి లాయర్లతో చర్చించడానికి ఏముంటుందని బీఆర్ఎస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏది ఏమైనా లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి వాడుకలోకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతాన్ని, పియర్స్ వద్ద జరుగుతున్న డ్రిల్లింగ్, శాంపిళ్ల సేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌ అనిల్‌జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలించిన ఆయనకు.. అధికారులు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షల వివరాలను, డ్రోన్ బేస్డ్ జీపీఆర్‌ టెస్ట్, క్రాస్‌ హోల్ సెస్మిక్ టెస్ట్ విధానాలను వివరించారు. మొత్తం 520 శాంపిళ్లను సేకరించి సీడబ్ల్యూఆర్పీఎస్‌కు పంపుతామని, ల్యాబ్ రిపోర్టుల తర్వాత బ్యారేజీ డ్యామేజీపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ. 198 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన భూమి పూజ చేశారు.