Mahaa Daily Exclusive

  ఖమ్మం కాంగ్రెస్‌లో తీరని విషాదం: రోడ్డు ప్రమాదంలో మాజీ సీసీసీ అధ్యక్షుడు మహ్మద్‌ జావిద్‌ దుర్మరణం

Share

*ఖమ్మం కాంగ్రెస్‌లో తీరని విషాదం.
* రోడ్డు ప్రమాదంలో మాజీ సీసీసీ అధ్యక్షుడు జావిద్‌ దుర్మరణం!
*పిల్లలమర్రి వద్ద డివైడర్‌ను ఢీకొన్న వాహనం.
* అక్కడికక్కడే మృతి చెందిన మహ్మద్‌ జావిద్‌.
*నిన్ననే కలిశాం.. ఇంతలోనే ఇలా జరగడం నమ్మలేకపోతున్నానన్న పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌.
ఖమ్మం, మహా.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. క్రమశిక్షణ గల నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఖమ్మం మాజీ సిటీ కాంగ్రెస్ కమిటీ (సీసీసీ) అధ్యక్షుడు మహ్మద్ జావిద్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం తన సొంత వాహనంలో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా నియంత్రణ తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో జావిద్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ వార్త తెలియగానే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
**“నిన్ననే కలిశాం.. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం” – మహేష్‌ కుమార్‌ గౌడ్‌**
జావిద్ మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం ఒక రోజు క్రితమే ఖమ్మంలో జరిగిన పార్టీ సమావేశంలో జావిద్ చురుగ్గా పాల్గొన్నారని, ఆ సందర్భంగా ఆయనను సన్మానించుకున్నామని పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. జావిద్ చాలా మంచి క్రమశిక్షణ గల నాయకుడని, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఖమ్మం జిల్లా నాయకులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న మహేష్ కుమార్ గౌడ్, బాధితుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జావిద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
ఖమ్మం నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జావిద్, సీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. మిత్రభాషిగా, అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన అకాల మరణం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద లోటుగా మిగిలిపోనుంది. జిల్లాలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయన మరణ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఈ విషాద వార్తతో జావిద్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Latest